ఇండియా అంటేనే హిందూ దేశం.. మోహన్ భగవత్ : బీజేపీకి తప్పని ఇక్కట్లు!

సోమవారం, 22 డిశెంబరు 2014 (09:44 IST)
ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ మరోమారు అధికార బీజేపీని ఇరకాటంలో పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఇండియా అంటేనే హిందూ దేశమని పేర్కొన్నారు. దీంతో పార్లమెంట్ ఉభయసభలు మరోమారు రాజకీయ రణరంగానికి వేదిక కానున్నాయి. 
 
హిందూ దేశమంటూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలతో విపక్షాలకు మరో అస్త్రం దొరికింది. ఈ వ్యాఖ్యలపై ఉభయ సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్, వామపక్షాలు, జనతా పరివార్ పార్టీలు ఇప్పటికే నిర్ణయించాయి. 
 
కేంద్ర ఆహార శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతితో పాటు కొందరు బీజేపీ ఎంపీలు చేసిన మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు గత రెండు వారాల నుంచి రాజ్యసభ కార్యకలాపాలు స్తంభించి పోయిన విషయం తెల్సిందే. కాగా, మోహన్ భగవత్ ప్రకటనపై బీజేపీ అధినేత అమిత్ షాను కూడా ఇరకాటంలో పడేశాయి. ఈ అంశంపై ఆయన స్పందించేందుకు షా నిరాకరించారు. 

వెబ్దునియా పై చదవండి