అమెరికన్ ఫుల్ బాడీ స్కానర్లకు పెద్ద చిక్కు తప్పట్లేదు. భారతీయ హిందూ మహిళలు సంప్రదాయంగా ధరించే మంగళసూత్రం, చీరకట్టుతో ఇబ్బందులు తప్పట్లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే? ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను పెంచేందుకు అమెరికాకు చెందిన పూర్తి శరీరం స్కాన్ చేసే పరికరాలను పరీక్షిస్తున్నారు. అయితే ఈ ట్రయల్స్‌లో మహిళల చీర, తాళి ఇబ్బందిపెడుతున్నాయట.
మడతలు, మడతలుగా కట్టుకునే చీరపై నుంచి స్కానర్ సరిగ్గా పనిచేయట్లేదట. పైగా భారీగా మెటల్, అద్దాల ఎంబ్రాయిడరీలతో ఉండే చీరలతోనూ ఇబ్బందిగా మారిందట. అయితే చాలామంది స్త్రీలు మంగళసూత్రం తీయడానికి ఒప్పుకోవట్లేదని సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) తెలిపింది. సాధారణంగా స్కానర్‌తో స్కాన్ చేసేందుకు శరీరంపై ఉన్న మెటల్ వస్తువులన్నీ తీసి పక్కన ట్రేలో పెట్టాలి.
కానీ మహిళలు మాత్రం తాత్కాలికంగా కూడా తాళిని తీసి ట్రేలో పెట్టడానికి అంగీకరించట్లేదట. అమెరికన్ స్కానర్లు మెడ నుంచి కింద వరకు స్కాన్ చేస్తాయని, అయితే తాము పూర్తి శరీరం స్కాన్ చేసే పరికరం కావాలని తయారీదారులను కోరినట్లు సీఐఎస్‌ఎఫ్ అధికారి వెల్లడించారు. ప్రస్తుతానికి అమెరికా స్కానర్‌ను పరీక్షించారు. ఇంకా జర్మనీ స్కానర్‌ను పరిశీలించాల్సి ఉంది.