ఎంపీ భర్త అని కూడా చూడలేదు.. శశికళ భర్తను చితక్కొట్టిన అన్నాడీఎంకే కార్యకర్తలు!

గురువారం, 29 డిశెంబరు 2016 (08:56 IST)
అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు, రాజ్యసభ ఎంపీ శశికళా పుష్ప భర్త లింగేశ్వర తిలకన్‌పై అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు దాడి చేశాయి. సుమారు 50 మందికి పైగా కార్యకర్తలు ఆయనపై ముష్టిఘాతాలు కురిపించారు. చివరకు ఆయన కిందపడి పోయినా వదిలిపెట్టలేదు. కాళ్లతో తన్నుతూ, పిడిగుద్దులు కురిపిస్తూ రక్తమోడేవరకూ చితగ్గొట్టారు. చివరకు అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు ఆయనను రక్షించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 
 
అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం గురువారం జరుగనుంది. ఈ భేటీలో పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోనున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసేందుకు శశికళా పుష్ప సిద్ధమయ్యారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక రాయపేటలో ఉన్న అన్నాడీఎంకే కార్యాలయానికి పుష్ప భర్త లింగేశ్వర తిలకన్ ఐదుగురు న్యాయవాదులతో కలిసి వచ్చారు. 
 
కార్యాలయంలోకి వెళ్లి నామినేషన్‌ పత్రాన్ని కొనుగోలు చేశారు. అనంతరం పుష్ప తరపున నామినేషన్‌ వేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పార్టీ కార్యకర్తలు ఆయనపై దాడికి దిగారు. దాడి జరిగిన సమయంలో పుష్ప అన్నాడీఎంకే కార్యాలయం బయట కారులో వేచి ఉన్నట్లు సమాచారం. 
 
కాగా, లింగేశ్వర తిలకన్ తమ పార్టీ కార్యాలయంలో గొడవలు, విధ్వంసం సృష్టించేందుకు వచ్చారంటూ అన్నాడీఎంకే నేతలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. అలాగే, తన భర్త లింగేశ్వర్‌ కనిపించడం లేదంటూ శశికళా పుష్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెబ్దునియా పై చదవండి