మహారాష్ట్రలోని సతారాలో ఓ ప్రేమోన్మాది పదో తరగతి బాలిక మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. దీన్ని గమనించిన స్థానికులు చాకచక్యంగా ఆ యువకుడుని పట్టుకుని చితక బాదారు. పట్టపగలు ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
సతారలోని ఓ పాఠశాలలో ఓ బాలిక పదో తరగతి విద్యాభ్యాసం చేస్తోంది. అయితే, 18 యేళ్ల మైనర్ యువకుడు ప్రేమ పేరుతో ఆ బాలిక వెంటపడగా, ఆ బాలిక తిరస్కరించింది. దీంతో ఆ యువకుడు ప్రేమోన్మాదిగా మారిపోయాడు. తనను ప్రేమించాలని వెంటపడుతూ వేధించసాగాడు. అయినప్పటికీ ఆ బాలిక ఏమాత్రం పట్టించుకోకపోవడంతో మరింత ఆగ్రహానికి గురయ్యాడు.
దీంతో ఆ బాలిక పాఠశాల నుంచి ఇంటికి తిరిగివస్తుండగా, అతను అడ్డుకుని మెడపై కత్తిపెట్టి బెదిరించాడు. దీన్ని గమనించిన స్థానికులు చాకచక్యంగా స్పందించి, ఆ బాలికను ఆ యువకుడు నుంచి సురక్షితంగా రక్షించారు. ఆ తర్వాత ఆ యువకుడికి దేహశుద్ది చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.