భారతదేశం రక్షణ గుట్టు బట్టబయలు ఎందుకవుతుంది... 'లీక్' చోరులెవరు...?

బుధవారం, 24 ఆగస్టు 2016 (15:18 IST)
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం ముందువరుసలో ఉంది. అందుకు తగ్గట్లుగానే భారత్, రక్షణ వ్యవస్థను కూడా పటిష్టం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఫ్రెంచ్ డిఫెన్స్ కాంట్రాక్టర్ డీసీఎన్ఎస్ కంపెనీ ద్వారా భారత్ నావికా దళం కోసం ఆరు స్కార్పియన్ క్లాస్ జలాంతర్గాములు తయారు చేస్తున్నారు. ఐతే ఎలా జరిగిందో తెలియదు కానీ వీటికి సంబంధించిన రహస్య సమాచారం అంతా 22,400 పేజీల్లో లీక్ అయినట్లు తెలుస్తోంది. 
 
ఈ విషయం బయటకు రావడం షాకింగ్‌గా మారింది. భారత రక్షణ వ్యవస్థ రహస్యాలను తెలుసుకునేందుకు పెద్దఎత్తున శత్రు దేశాలు పనిగట్టుకుని వెంటబడుతున్నాయా అనే అనుమానం కూడా వస్తోంది. కాగా ఈ జలాంతర్గాముల రహస్య వివరాలు బయటకు రావడంతో వాటి పనితీరు, వాటి సామర్థ్యం అంతా తెల్లకాగితంపై నల్లటి అక్షరాల మాదిరిగా స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు. 
 
ఐతే రక్షణ మంత్రి పారికర్ దీనిపై మాట్లాడుతూ.. ఈ విషయం గురించి తనకు అర్థరాత్రి 12 గంటలకు సమాచారం అందిందనీ, ఐతే అసలు లీక్ అయిన సమాచారం 100 శాతం అదేనని అనుకోలేమనీ, హాకింగ్ కూడా అయి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి