ఫడ్నవిస్ సర్కారును పడగొట్టం కానీ.. శరద్ పవార్.. శివసేన నిప్పులు!!

బుధవారం, 19 నవంబరు 2014 (17:22 IST)
మహారాష్ట్రలోని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యమేమీ లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాటమార్చారు. కానీ, ఈ మరాఠా యోధుని మాటలగారడిపై ప్రతిపక్షం శివసేన మాత్రం నిప్పులు చిమ్మింది. రాజకీయాలపై అపనమ్మకం ఉన్నవారే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తారని తమ పత్రిక సామ్నాలో విమర్శించింది. రాష్ట్రంలోని రాజకీయ అస్థిరతను ఆయన తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఎన్సీపీ చూస్తోందని ఆరోపించింది. 
 
తొలుత బేషరతు మద్దతు ప్రకటించిన శరద్ పవార్, ఆయన పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తోందని పేర్కొంది. తాము మాత్రం అవకాశవాద రాజకీయాలకు దూరంగా ఉంటామని తెలిపింది. పవార్ తనకు ఇష్టమనున్నది చేసుకోవచ్చునని ఎద్దేవా చేసింది. తాము మాత్రం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పింది. ప్రభుత్వాన్ని భవిష్యత్తులో తమ చేతుల్లో ఉంచుకోవాలని ఆయన భావిస్తున్నారని ఆరోపించారు. పూర్తి మెజార్టీ లేని ప్రభుత్వాన్ని ఆయన తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. 
 
మరోవైపు.. పవార్ తన వ్యాఖ్యలపై బుధవారం యు టర్న్ తీసుకున్నారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచనేదీ తమకు లేదన్నారు. అయితే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని భావిస్తే తమ నిర్ణయం మారుతుందన్నారు. పూణే సమీపంలోని అలీబూగ్‌లో జరుగుతున్న పార్టీ కార్యకర్తల సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకుంటే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. 

వెబ్దునియా పై చదవండి