ఓ కామాంధుడి కామానికి బలైపోయిన అభాగ్యురాలి కథ ఇది. కదులుతున్న రైల్లో ఆమెపై అత్యాచారం చేయడమే కాక, ఆ దారుణానికి పాల్పడి ఆమెను రైల్లో నుంచి తోసేసిన ఘోరమైన గాధ ఇది. వివరాల్లోకి వెళితే... ఐదేళ్ల క్రితం 24 ఏళ్ల సౌమ్య(కేరళ) ఓ షాపింగ్ మాల్‌లో పని ముగించుకుని 2011 ఫిబ్రవరి 1న మహిళా బోగీలో ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టింది. ఏర్నాకులం నుంచి శొర్‌నూర్ వరకూ రైల్లో వెళుతోంది. ఈ సమయంలో తమిళ యువకుడు గోవిందచామి రైలెక్కాడు. మహిళా బోగీలో సౌమ్య ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు.
దొంగతనాలు చేసే అతడు ఆమె వద్ద సొమ్మును దోచుకోవడమే కాకుండా ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను రైల్లో నుంచి కిందికి తోసేశాడు. అడవుల్లో ఆమెను కనుగొన్న స్థానికులు ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది. ఆమె మృతి చెందింది. ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుపై విచారణ చేసిన కోర్టులు గోవిందచామికి మరణ శిక్ష విధించాయి. ఎన్ని కోర్టు మెట్లెక్కినా అదే ఫలితం వచ్చింది. చివరికి సుప్రీంకోర్టు తలుపుతట్టాడు గోవిందచామి.
వాదనలు విన్న సుప్రీంకోర్టు సౌమ్యపై అత్యాచారం చేసింది గోవిందచామి అయినప్పటికీ ఆ తర్వాత ఆమెను రైల్లోంచి తోసింది అతడా కాదా అని బాధితురాలి తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించకపోవడంతో రైల్లోంచి తోసింది గోవిందచామేనని నిరూపితం కాలేదు కనుక అతడికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పుడు ఈ తీర్పుతో బాధితురాలి తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. తన బిడ్డపై అత్యాచారానికి పాల్పడమే కాకుండా ఆమె ప్రాణాలు తీసిన వ్యక్తికి కేవలం 7 ఏళ్ల జైలు శిక్ష విధించి వదిలేస్తారా అని ఆమె ప్రశ్నిస్తోంది. కాగా దోషి గోవిందచామి మాత్రం తనకు టీ, వడై ఇవ్వరూ అంటూ పండగ చేస్కుంటున్నాడు.