సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరీ..! పక్కకు తప్పుకున్న పిళ్లై..!

ఆదివారం, 19 ఏప్రియల్ 2015 (12:35 IST)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కొత్త ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎన్నిక కానున్నారు. ఈ పదవి కోసం బరిలో నిలిచిన తమిళనాడు కమ్యూనిస్టు సీనియర్ నేత రామచంద్రన్ పిళ్లై అకస్మాత్తుగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాక ఈ పదవి కోసం దాఖలు చేసిన నామినేషన్‌ను పిళ్లై ఉపసంహరించుకున్నారు. 
 
దీంతో ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎన్నిక లాంఛనమేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. విశాఖలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం సీతారాం ఏచూరీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.
 
కాగా సీపీఎం 21వ జాతీయ మహాసభల చివరిరోజైన ఆదివారం విశాఖపట్నంలో భారీ బహిరంగసభ జరగనుంది. ఇక్కడి ఆర్‌కే బీచ్‌లో కాళీమాత ఆలయం వద్ద నిర్వహిస్తున్న ఈ సభకు లక్షమందికిపైగా హాజరవుతారని అంచనా.  సభలో పార్టీ ప్రముఖులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు, సీతారాం ఏచూరి, బృందాకారత్‌తోపాటు త్రిపుర సీఎం మాణిక్ సర్కార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ నరసింగరావు ప్రసంగిస్తారని తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి