జాతీయగీతానికి గౌరవమివ్వడం మొక్కుబడి కారాదన్న సుప్రీం

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (02:08 IST)
జాతీయగీతానికి గౌరవమివ్వడం మొక్కుబడిలా మారుతున్న నేపథ్యంలో తెరంపై దాన్ని ప్రదర్శించిన ప్రతిసారీ లేచి నిలబడవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు వివరించింది. గత రెండు మూడునెలలుగా లక్షలాది భారతీయ ప్రేక్షకులకు తలనొప్పి కలిగిస్తున్న గందరగోళానికి సర్వోన్నత న్యాయస్థానం మంగళం పలికేసింది. థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతం వస్తున్నప్పుడు మాత్రమే ప్రేక్షకులు లేచి నిలబడితే చాలని సుప్రీం స్పష్టత నిచ్చింది. 
 
చిత్ర ప్రదర్శనకు ముందు జాతీయగీతం వచ్చినప్పుడు థియేటర్‌లోని వారు అందరూ గౌరవ సూచకంగా నిలబడుతున్నారు. అయితే ఇటీవల చోటు చేసుకున్న కొన్ని ఘటనలు చివరకు పోలీస్‌ కేసులు నమోదయ్యే వరకూ వెళ్లాయి. మరోపక్క ఒక్కోసారి సినిమా కథలో భాగంగా, ప్రకటన సమయంలో కూడా జాతీయగీతం వినిపిస్తుండటంతో పలువురు లేచి నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సినిమా ప్రారంభంలో కాకుండా మరే సమయంలోనైనా జాతీయగీతం ప్రసారమైతే లేచి నిలబడాలా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. 
 
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు మంగళవారం వివరణ ఇచ్చారు.  చిత్ర ప్రదర్శనలకు ముందు జాతీయగీతం వస్తున్నప్పుడు ప్రేక్షకులు గౌరవ సూచకంగా లేచి నిలబడితే సరిపోతుందని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, ఆర్‌.భానుమతిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సినిమా కథ, న్యూస్‌రీల్‌, డాక్యుమెంటరీల సందర్భంగా జాతీయగీతం ప్రసారమైతే లేచి నిలబడాల్సిన అవసరం లేదని పేర్కొంది.పిటిషనర్‌ లేవనెత్తిన అంశంపై పూర్తిస్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉందంటూ , తదుపరి విచారణను ఏప్రిల్‌ 18కు వాయిదా వేశారు.
 
దేశవ్యాప్తంగా చిత్ర ప్రదర్శనలకు ముందు జాతీయగీతాన్ని తప్పనిసరిగా వినిపించాల్సిందేనని గతేడాది నవంబర్‌ 30న సుప్రీంకోర్టు సినిమా థియేటర్లను ఆదేశించిన సంగతి తెలిసిందే. జాతీయ గీతం వస్తున్నప్పుడు ప్రేక్షకులు గౌరవ సూచకంగా లేచి నిలబడాలని కూడా స్పష్టం చేసింది.
 

వెబ్దునియా పై చదవండి