విదేశాంగ కార్యదర్శి మార్పు రచ్చ : నరేంద్ర మోడీ వర్సెస్ సుష్మా స్వరాజ్!

శుక్రవారం, 30 జనవరి 2015 (12:05 IST)
భారత విదేశాంగ కార్యదర్శి మార్పు అంశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ల మధ్య చిచ్చురేపింది. ఇప్పటి వరకు విదేశాంగ కార్యదర్శిగా ఉన్న సుజాతా సింగ్‌ను బుధవారం రాత్రి తప్పించిన ప్రధానమంత్రి మోడీ.. మరుక్షణమే ఆ పదవిలో మూడు రోజుల్లో పదవీ విరమణ చేయనున్న జైశంకర్‌‍ను నియమించారు. ఈ పోస్టింగ్‌తో జైశంకర్ పదవీకాలం మరో రెండేళ్లు పెరిగింది. పైగా మరో ఎనిమిది నెలల పాటు సర్వీసు ఉన్న సుజాతా సింగ్‌ను తప్పించడానికి గల కారణాలను తెలియరావడం లేదు. 
 
అదేసమయంలో విదేశాంగ మంత్రిగా ఉన్న తనకు తెలియకుండానే విదేశాంగ కార్యదర్శిని ఎలా మారుస్తారంటూ సుష్మా స్వరాజ్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. ఈ క్రమంలో ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పాల్గొనాల్సిన రెండు సభలకు సుష్మా డుమ్మా కొట్టారు. 
 
అంతేకాక సుజాతా సింగ్‌ను తప్పించాలని గతంలోనే మోడీ యత్నించగా, సుష్మా అడ్డుకున్నారన్న వార్తలూ తాజాగా వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే సుజాతా సింగ్ ఉన్నంత కాలం విదేశాంగ విధానానికి సంబంధించిన కీలక నిర్ణయాలపై పీఎంఓ నాన్చుడు ధోరణిని అవలంభించిందన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. 

వెబ్దునియా పై చదవండి