మాజీ సీఎం జయలలితకు భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని, జయ కాంస్య విగ్రహాన్ని పార్లమెంటులో ప్రతిష్ఠించాలని కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది. జయమరణానంతరం సీఎం బాధ్యతలు చేపట్టిన ఒ.పన్నీర్ సెల్వం శనివారం తన మంత్రివర్గ సహచరులతో తొలిసారి భేటీ అయ్యారు. అంతకుముందు మెరీనాకు వెళ్లి జయలలిత, ఎంజీఆర్ సమాధుల వద్ద ఆశీస్సులు పొందిన పన్నీర్ సెల్వం బృందం పోయెస్ గార్డెన్‌లో చిన్నమ్మ శశికళ దీవెనలూ పొందింది.
అదేవిధంగా జయలలిత పార్ధివదేహాన్ని ఖననం చేసిన ప్రాంతంలో రూ.15 కోట్లతో స్మారక మందిరం నిర్మించాలని, రాష్ట్ర అసెంబ్లీలో చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని, భారతరత్న డాక్టర్ ఎంజీఆర్ సమాధి పేరును ''భారతరత్న డాక్టర్ పురచ్చితలైవర్ ఎంజీఆర్''గా మార్చడంతో పాటు జయ సమాధికి ‘పురచ్చితలైవి అమ్మ సెల్వి జె.జయలలిత స్మారక మందిరం’గా పేరు పెట్టాలని మంత్రివర్గం తీర్మానించింది.
ఇదిలా ఉంటే.. టీస్టాల్ ఓనర్‌గా జీవితం ప్రారంభించిన పన్నీర్ సెల్వం ఇప్పుడు తమిళనాడు కొత్త సీఎం అయ్యారు. పన్నీర్ సెల్వం ఇప్పుడు అమ్మకు వారసుడయ్యారు. తనకు అవసరమైనప్పుడు సీఎం సీట్లో సెల్వాన్ని జయ కూర్చోబెట్టారు. సెల్వమే ఇప్పుడు ఆమె ఖాళీ చేసిన వెళ్లిన సీట్లో కూర్చున్నారు. అక్రమాస్తుల కేసులో జయ జైలుకెళ్లినప్పుడు, అనారోగ్యంతో ఆమె ఆసుపత్రిలో వున్నప్పుడు సీఎం బాధ్యతలు నిర్వర్తించిన పన్నీర్‌సెల్వం తన టేబుల్‌పై ముందు భాగంలో ఆమె ఫోటో వుండేలా జాగ్రత్త తీసుకునేవారు.