ఓర్నీ.. తస్సారావుల బొడ్డు... రూ.9 కోట్లకు టీ, సమోసా, గులాబ్‌ జామ్లకు బొక్కేశారు!

గురువారం, 1 సెప్టెంబరు 2016 (06:13 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నేరాలకు, ఘోరాలకు, అత్యాచారాలకు అడ్డాగా మాత్రమే కాదు.. ఆ రాష్ట్ర ప్రజాప్రతినిధులు ప్రజా ధనాన్ని కోట్లకు కోట్లు బొక్కేసే విషయంలో కూడా ముందుంటారని తాజాగా నిరూపించారు. తమను కలవడానికి వచ్చిన అతిథులు, అధికారులకు టీ, సమోసా, గులాబ్‌జామ్ వంటి అల్పాహారం ఇవ్వడానికి నాలుగేళ్లలో ఏకంగా రూ.9 కోట్లు ఖర్చు చేశారు. 
 
అదేదో వారి సొంత డబ్బుతో కాక ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకున్న ప్రజల సొమ్ముతో వారు ఈ ఆర్భాటాలు చేశారు. విషయాన్ని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్వయంగా బుధవారం శాసనసభలో వెల్లడించడం గమనార్హం. 2012 మార్చి 15న అఖిలేష్ యాదవ్ యూపీ అధికార పగ్గాలు చేపట్టగా 2016 మార్చి 15 నాటికి అతిథులకు ఇచ్చిన అల్పాహారానికి అక్షరాలా రూ.8,78,12,474 ఖర్చయిందని ఆయన చెప్పారు. 
 
అల్పాహారం కోసం రూ.21 లక్షలకు పైగా వెచ్చించిన మంత్రుల సంఖ్య. సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) అరుణ్ కుమార్ కోరి ఇందుకోసం అత్యధికంగా రూ.22,93,800 ఖర్చు చేయగా, ప్రజాపనుల విభాగం మంత్రి శివ్‌పాల్ యాదవ్ మాత్రం అల్పాహారం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లో తమ అతిథులకు మర్యాదలు చేయడానికి అక్కడి మంత్రులు రోజుకు రూ.2,500ల నుంచి రూ.3 వేల వరకు ఖర్చు పెట్టుకునే వెసులుబాటు ఉంది. దీన్ని అడ్డుపెట్టుకుని మంత్రులు ప్రజాధనాన్ని టీ సమోసాల పేరిట బొక్కేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి