నేను వెళ్లొచ్చాక ఆలయాన్ని ప్రక్షాళన చేశారు: జీతన్ రామ్

సోమవారం, 29 సెప్టెంబరు 2014 (12:32 IST)
ఆలయాల్లో వివక్ష ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని సాక్షాత్తు ఓ ముఖ్యమంత్రి వాపోయారు. తాను వెళ్లి వచ్చిన తర్వాత ఆ ఆలయాన్ని ప్రక్షాళన చేశారని ఆయన ఆరోపించారు. ఆయనెవరో కాదు.. బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ. ఆయన షెడ్యూలు కులాలకు చెందినవారు.
 
గత ఆగస్టు నెలలో ఉప ఎన్నికల సందర్భంగా తాను మధుబనిలోని ఓ ఆలయానికి వెళ్లానని, ఆ తర్వాత వాళ్లు ఆ దేవాలయాన్ని కడిగి, ప్రక్షాళన చేసుకున్నారని మాంఝీ చెప్పారు. ఏదైనా అవసరం ఉంటే మాత్రం వాళ్లు తన కాళ్లు పట్టుకోడానికి కూడా వెనకాడరని, మరి ఆలయంలో మాత్రం ఇలా చేయడం ఏంటని అడిగారు.
 
రాష్ట్ర మంత్రి ఒకరు తాను వెళ్లిన తర్వాత ఇలా జరగినట్లు చెప్పారన్నారు. పురాతన కాలంనాటి మనుధర్మాన్ని వాళ్లింకా పాటిస్తున్నారని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి