కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష చేయించుకునేందుకు ఓ వ్యక్తి నిరాకరించాడు. దీంతో ఆ వ్యక్తిని కొందరు కలిసి కొట్టి చంపేశారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నూర్‌లోని మలక్‌పూర్ గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఈ గ్రామానికి చెందిన మంజీత్ సింగ్ అనే వ్యక్తి ఢిల్లీలో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయాడు. దీంతో తన మలక్ పూర్ గ్రామానికి ఇటీవలే చేరుకున్నాడు. దీంతో కరోనా పరీక్షలు చేయించుకోవాలని మలక్ సింగ్‌ను అతని కజిన్స్ కపిల్, మనోజ్ కోరారు.
అయితే, ఈ పరీక్షలు చేయించుకునేందుకు మలక్ సింగ్ ససేమిరా అన్నాడు. దీంతో మంజీత్‌తో కజిన్స్ గొడవపడి కర్రలతో దాడి చేశారు. మంజీత్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, మంజీత్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ ఘటనపై అతడి తల్లి దండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. మంజీత్ కజిన్స్ కపిల్, మనోజ్‌తో పాటు వారి తల్లి పుణియా, మనోజ్ భార్య డాలీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఇటీవల మంజీత్ సింగ్ బిజ్నూర్‌కు చేరుకున్నాక అతడికి థర్మల్ స్కానింగ్ చేశామని, నెగిటివ్ రావడంతో అతని శాంపిల్స్ తీసుకోలేదని పోలీసులు వివరించారు.