పెళ్లి కోసం 850 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుతూ ప్రయాణం.. చివరికి?

సోమవారం, 20 ఏప్రియల్ 2020 (17:49 IST)
Cycling
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. ఈ ప్రభావంతో ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా లాక్ డౌన్‌లో వుంది. ప్రస్తుతం భారత్‌లో మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర సర్కారు. కరోనా బాధిత ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రస్తుతం కొనసాగుతోంది. దీంతో శుభకార్యాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఇంకా వివాహాలు చాలా సింపుల్‌గా జరిగిపోతున్నాయి. 
 
తాజాగా యూపీ మహారాజ్ గంజ్ జిల్లాకు చెందిన సోను అనే వ్యక్తి.. పంజాబ్, లూధియానా ప్రాంతంలో టైల్స్ కర్మాగారంలో పనిచేస్తున్నాడు. ఇతనికి సొంత ఊరిలో ఏప్రిల్ 15వ తేదీన వివాహం జరిపేందుకు పెద్దలు ముహూర్తం కుదిర్చారు.  
 
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చడంతో.. దాన్ని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం జరిగింది. రవాణా సౌకర్యాలు పూర్తిగా స్తంభించాయి. అయితే సొంత గ్రామానికి చేరుకోవాలనే తపనతో సోను స్నేహితులతో కలిసి సైకిల్‌తోనే ప్రయాణమయ్యాడు. ఏప్రిల్ 12వ తేదీ సోను అతని స్నేహితులు సైకిల్ ద్వారా మూడు రోజుల పాటు ప్రయాణం చేశారు. 
 
850 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి యూపీ సరిహద్దుకు వచ్చారు. అక్కడ చెక్ పోస్టు వద్ద పోలీసులు వారిని ఆపారు. అక్కడున్న శిబిరంలో వారిని బస చేయించారు పోలీసులు. కానీ సోనూ మాత్రం.. పంజాబ్ నుంచి యూపీకి వచ్చేశామని.. ఇక్కడ నుంచి సొంత గ్రామానికి 150 కిలోమీటర్ల దూరమే వుందని.. పోలీసులు అనుమతి ఇచ్చివుంటే.. తన వివాహం నిరాడంబరంగానైనా జరిగివుంటుందని వాపోతున్నాడు.
 
కానీ ఆరోగ్యంతో వుండటం ముఖ్యమని.. వివాహాన్ని మళ్లీ  చేసుకోవచ్చునని సోను సమర్థించుకున్నాడు. సైకిల్‌ ద్వారా చాలా దూరం ప్రయాణం చేసిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నామని.. వాటి ఫలితాలు వచ్చాక.. వారికి స్వగ్రామానికి వెళ్లేందుకు అనుమతి ఇస్తామని చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు