త్వరలో తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలిత వారసురాలిగా ఆ పార్టీ పగ్గాలు చేపట్టనున్న శశికళ నటరాజన్‌పై అన్నాడీఎంకే బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప సంచలన ఆరోపణలు చేశారు. జయలలితను హత్య చేసేందుకు గతంలోనే శశికళ కుట్ర పన్నారనీ, అందువల్లే ఆమెను గతంలో పార్టీ నుంచి బహిష్కరించారంటూ వ్యాఖ్యానించారు.
జయలలిత స్థానంలో శశికళ నటరాజన్‌కు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు పార్టీ నేతలంతా సిద్ధమైన విషయం తెల్సిందే. ఇలాంటి తరుణంలో శశికళ పుష్పా సంచలన ఆరోపణలు చేశారు. శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపిక చేయడం సరికాదని, ఆ పదవికి జయలలిత ఆమె పేరును ఎప్పుడూ సూచించలేదన్నారు. అందుకే ఆమెకు కనీసం కౌన్సిలర్ పదవిగానీ, ఎమ్మెల్యే సీటు గానీ ఇవ్వలేదని, శశికళ రాజకీయాలకు పనికిరారని ఆమె గుర్తు చేశారు.
పైగా, జయలలితను చంపేందుకు ఇంతకుముందు కుట్ర పన్నినందుకే ఆమెను జయలలిత బహిష్కరించారని ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అంతేకాకుండా, జయలలిత మృతిపై తమకు అనుమానాలున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని పుష్ప డిమాండ్ చేశారు. పార్టీలోనూ పలువురిలో ఇటువంటి అనుమానాలే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రధాన కార్యదర్శి నియామకం చేపట్టాలంటూ తాను మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.