'అయిగిరి నందిని, నందిత మేదిని, విశ్వ వినోదిని నందనుతే'... శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారం(video)

సోమవారం, 10 అక్టోబరు 2016 (14:30 IST)
“అయిగిరి నందిని, నందిత మేదిని, విశ్వ వినోదిని నందనుతే
గిరి వర వింధ్య శిరోధిని వాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుమ్భిని భూరికుటుంభిని భూరికృతే
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతే!!”
 
దేవీ నవరాత్రులలో అత్యుగ్ర రూపము మహిషాసుర మర్ధినీ దేవి. ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసుర మర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసింది. ధర్మ విజయమునకు సంకేతముగా ఈ పర్వదినాన్ని మహర్నవమిగా భక్తులు ఉత్సవము జరుపుకుంటారు. సింహ వాహనమును అధీష్ఠించి ఆయుధములను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తి రూపములో ఈ రోజు దర్శనమిస్తుంది.
 
సింహ వాహనం మీద ఒక చేత త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుణ్ణి సంహరిస్తున్న రూపంతో దుర్గమ్మ దర్శనమిస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడను సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి.ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది. నవరాత్రి దీక్షలో మహర్నవమి మఖ్యమైనది. సాధకులకు నేడు మంత్రసిద్ధి జరిగే రోజని ఈ రోజుని ‘సిద్దిదా’ అని పిలుస్తారు. 
 
పూర్వకాలంలో జైత్రయాత్రలకు వెళ్ళే రాజులు, చక్రవర్తులు నవమి రోజున ఆయుధ పూజలు చేసేవారు. అలా చేయడంవల్ల వారికి విజయం సంప్రాప్తించేది. కాలక్రమంగా అదే ఆచారం నేటికీ కొనసాగుతోంది. ఆ రోజు వాహనాలు, వస్తూత్పతి తచేసే యంత్రాలున్నవారు సహస్రనామ పూజగానీ, అష్టోత్తర శతనామ పూజ కానీ చేయడం శ్రేయస్కరం కాగలదు. ధర్మరాజు కూడా వారి అజ్ఞాత వాసం సజావుగా సాగేలా చేయమని దుర్గాదేవిని ప్రార్థించాడట. 
 
ఈ మహర్నమినాడు అమ్మను స్తుతించినవారికి సకల వ్యాధుల బారినుండి కాపాడి సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తుంది, అపమృత్యువును పోగొడుతుంది, పరిపుష్టికరమైన ఆహారాన్నిస్తుంది, ఆధ్యాత్మిక విజ్ఞానాన్నిచ్చి, మనిషిలోని దైవీశక్తిని పెంపొందిస్తుంది. ఈ పర్వదినాన అమ్మవారికి చక్రపొంగళి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.  నేడు చండీ సప్తశతీ హోమము చేస్తే పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది.

వెబ్దునియా పై చదవండి