వేసవికి మేలు చేసే దోసకాయతో మటన్ గ్రేవీ ఎలా చేయాలి

బుధవారం, 3 మే 2017 (16:44 IST)
దోసకాయ వేసవికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్ డి శరీరాన్ని చల్లబరుస్తుంది. దోసకాయలో 90 శాతం వరకు నీరు ఉంటుంది. అంతేకాకుండా, శరీరాన్ని హైడ్రేటేడ్‌గా ఉంచుతుంది. దోసకాయ, యాంటీ-ఇంఫ్లమేటరీ గుణాలను కలిగి ఉన్నందు వలన, కంటికి కలిగే వ్యాధులను తగ్గించటమే కాకుండా, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కేవలం 15 నిమిషాల పాటూ కళ్ళపై, తాజా దోసకాయ ముక్కలను ఉంచటం వలన మంచి విశ్రాంతి లభిస్తుంది. శరీరంలో కొవ్వు పదార్థాలను తగ్గించే ''స్టేరాల్'' అనే మూలకం దోసకాయలో ఉంటుంది. అంతేకాకుండా, బరువును తగ్గించవచ్చు. అలాంటి దోసకాయతో వేసవిలో మటన్ కూర చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
మటన్ : అరకేజీ
దోసకాయ ముక్కలు - రెండు కప్పులు 
ఉల్లి తరుగు - అర కప్పు 
టమోటా తరుగు- అర కప్పు 
కొత్తిమీర తరుగు - పావుకప్పు
పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూన్లు,
కారం - రెండు చెంచాలు, 
ఉప్పు - తగినంత, 
గరంమసాలా - ఒక చెంచా, 
అల్లంవెల్లుల్లి ముద్ద - చెంచా, 
నూనె - తగినంత,
 
తయారీ విధానం : 
బాణలిలో నూనె పోసి వేడయ్యాక ఉల్లి, టమోటా, పచ్చిమిర్చి తరుగును వేసి వేయించాలి. దోరగా వేగాక అందులో దోసకాయ ముక్కల్ని వేసి మూతపెట్టాలి. ఇందులోనే పసుపు, కాసింత ఉప్పుతో ఉడికించిన మటన్‌ ముక్కలు వేయాలి. దోసకాయ ముక్కలు మెత్తగా అయ్యాక తగినంత ఉప్పు, కారం, గరంమసాలా, అల్లంవెల్లుల్లి ముద్ద ఒకదాని తరవాత మరొకటి వేసి బాగా కలపాలి. కూరలో చేరిన నీళ్లు ఆవిరయ్యాక కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి. వేడి వేడి దోసకాయ మటన్ రెడీ.

వెబ్దునియా పై చదవండి