అక్రమ వలసలకు అడ్డుకట్ట వేస్తాం : వాయలార్ రవి

FILE
విదేశాలలో ఉంటున్న భారతదేశ మధ్యవర్తులపై ఉక్కుపాదం మోపి, తద్వారా అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయనున్నామని కేంద్ర ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖా మంత్రి వాయలార్ రవి స్పష్టం చేశారు. లిబియా, మలేషియా, యెమెన్, మాల్దీవులు, గల్ఫ్ దేశాల్లోని భారత దౌత్య కార్యాలయ అధికారులతో న్యూఢిల్లీలో సమావేశమైన సందర్భంగా ఆయన పై విధంగా స్పందించారు.

సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. భారత ఆతిథ్య దేశాల్లోని మధ్యవర్తుల చట్ట విరుద్ధమైన చర్యల కారణంగా అక్రమ వలసలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి గతంలోనే పలు దేశాలలో ఉన్న భారత రాయబార కార్యాలయాలకు లేఖలు రాసినట్లు ఆయన వివరించారు.

చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే దళారీ సంస్థల సమాచారాన్ని సేకరించి, భారత ఎన్‌ఫోర్స్‌మెంటుకు వివరాలను అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాయలార్ రవి దౌత్యాధికారులకు తెలిపారు. కాగా వివిధ దేశాల్లోని దౌత్యాధికారులతో రాష్ట్ర ప్రభుత్వాలకు నేరుగా సంబంధాలు ఉంటే.. అక్రమ వలసలను సమర్థవంతంగా నిరోధించే అవకాశం ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి