అడ్డదారుల్లో వచ్చినవారిపైనే దాడులు : రాబ్‌సన్

FILE
అడ్డదారుల్లోనూ, ప్రైవేట్ ఏజెన్సీల ద్వారాను ఆస్ట్రేలియాకు వచ్చిన విద్యార్థులపైనే ప్రధానంగా దాడులు జరుగుతున్నాయని వెస్ట్రన్ ఆస్ట్రేలియా వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ అలన్ రాబ్‌సన్ వెల్లడించారు. ఇలా వచ్చినవారు ట్యాక్సీ డ్రైవర్లుగా పనిచేస్తూ రాత్రుల్లో కూడా పని చేస్తున్నారని, అలాంటి వారిపైనే ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

జీవశాస్త్రంలో వస్తున్న ఆధునిక ధోరణులపై సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ)లో జరిగిన ఒకరోజు సదస్సుకు అలన్ రాబ్‌సన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వచ్చిన వారిపైనే దాడులు జరుగుతున్నాయన్నారు.

నేరుగా ఆస్ట్రేలియా విశ్వ విద్యాలయాలలో ప్రవేశం పొందిన విద్యార్థులపై ఎలాంటి దాడులు జరగటం లేదని రాబ్‌సన్ స్పష్టం చేశారు. కేవలం భారత్ నుంచే కాకుండా, ఇతర దేశాల నుంచి వస్తున్న విద్యార్థులపై కూడా ఇలాంటి దాడులు జరిగాయని ఆయన తెలియజేశారు. ఇదిలా ఉంటే.. జాత్యహంకార దాడుల విషయంలో ఇప్పటికే పరువు పోగొట్టుకున్న ఆసీస్.. రాబ్‌సన్‌ వ్యాఖ్యలవల్ల ఇంకా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో కాలమే తేల్చాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి