అమెరికాలో జూలై 2నుంచి "నాట్స్" సంబరాలు

ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులకు వినోదాన్ని పంచేందుకు జూలైన 2వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు "ఉత్తర అమెరికా తెలుగు సంబరాల"ను నిర్వహిస్తున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ప్రకటించింది. ఓర్లాండోలోని ఆరంజ్ కౌంటీ సమావేశ కేంద్రంలో జరుగనున్న ఈ వేడుకలకు ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ప్రతి తెలుగువారూ హాజరవ్వాలని నాట్స్ విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు నాట్స్ నిర్వాహకులు మధు కొర్రపాటి ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ వేడుకలకు యువనటుడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు వెల్లడించారు. సంబరాలలో పాల్గొనేందుకు వచ్చేవారు బస చేసే హోటల్ రేట్లు వీలైనంత తక్కువగా ఉండేలా నాట్స్ చర్యలు చేపట్టినట్లు మధు వివరించారు.

అలాగే ప్రముఖ తెలుగు నటులు శ్రీకాంత్, సాయి కుమార్, ఆహుతీ ప్రసాద్‌లు మరియు కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్ తదితరులు సంబరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోనున్నట్లు మధు వివరించారు. గజల్ శ్రీనివాస్, మృదంగ బ్రహ్మ యల్లా వెంకటేశ్వరరావుల సంగీత విభావరి తమ వేడుకలకు ప్లస్ పాయింట్ అవుతుందని ఆయన అన్నారు.

ఇంకా ఈ వేడుకలలో... చిన్మయ మిషన్ ఆచార్యులు స్వామి చిదాత్మానంద, అవధానులు శ్రీ కోట లక్ష్మీ నరసింహం, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, వద్దిపర్తి పద్మాకర్, అనుమండ్ల భూమయ్య, జొన్న విత్తుల తదితరులు పాల్గొంటారని మధు పేర్కొన్నారు. ఉత్తర అమెరికాలోని తెలుగు ప్రజలందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

వెబ్దునియా పై చదవండి