ఆగని ఘాతుకాలు : ఆసీస్‌లో భారత విద్యార్థిపై దాడి

FILE
ఆస్ట్రేలియాలో జాత్యహంకార దాడులు తగ్గుముఖం పట్టాయని ఆ దేశ ప్రభుత్వం ఓ వైపు చెబుతున్నప్పటికీ.. మరోవైపు రోజు రోజుకీ దాడులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మెల్‌బోర్న్‌లో 23 సంవత్సరాల భారత విద్యార్థి గుర్తు తెలియని దుండగుడి దాడిలో గాయపడ్డాడని అక్కడి పోలీసులు బుధవారం వెల్లడించారు.

కాగా, భారత విద్యార్థిపై దాడికి పాల్పడ్డ దుండగుడు బర్న్స్‌విక్ వెస్ట్ వీధిలో రక్త గాయాలతో పడేసి వెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. ది ఏజ్ పత్రిక కథనం ప్రకారం... దాడికి గురైన భారత విద్యార్థి తన గర్ల్‌ఫ్రెండ్‌ను డిన్నర్ చేసేందుకు బయటికి తీసుకెళ్లేందుకు ఆమె ఇంటిముందు తన ట్యాక్సీతో వేచి చూస్తుండగా, అందులోకి ఇంకో వ్యక్తి దూరినట్లు తెలుస్తోంది.

ఆ సమయంలో భారత విద్యార్థి అతని గర్ల్‌ఫ్రెండ్‌తో పోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ట్యాక్సీలోకి దూరిన ఆ దుండగుడు బాధితుడిని డ్రైవర్ సీట్లోంచి తోసేసిన శబ్దాన్ని అతని గర్ల్‌ఫ్రెండ్ ఫోనుద్వారా విని అతను దాడికి గురైనట్లు అర్థం చేసుకుని పరుగులు తీసిందని పోలీసు అధికారి గ్రెగ్ జాన్సన్ ఏజ్ పత్రికకు వివరించాడు.

వెంటనే పరుగెత్తుకుని బయటికి వచ్చిన చూసిన ఆమె బాధితుడు ఛాతీపై గాయంపై రక్తమోడుతూ కనిపించటంతో వెంటనే ఆసుపత్రికి తరలించింనట్లు గ్రెగ్ తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ దాడిని జాత్యహంకారంతో కూడినదిగా తాము భావించటం లేదనీ, ఇది కేవలం దొంగతనం కేసుగానే తాము పరిగణిస్తున్నామని ఆయన చెప్పాడు. ఎందుకంటే, దాడికి పాల్పడ్డ దుండగుడు బాధితుడి వద్ద డబ్బు, మొబైల్, ఐపాడ్ తదితర వస్తువులను దొంగిలించుకు వెళ్లటమే ఇందుకు నిదర్శనమని గ్రెగ్ అన్నారు.

వెబ్దునియా పై చదవండి