ఆగని దారుణాలు.. మరో ఇద్దరిపై దాడి..!

ఆస్ట్రేలియాలో గత కొన్ని రోజులుగా భారతీయులపై జరుగుతున్న దాడులు మరింతగా పెరుగుతూ... ఒక్కోటీ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో ఇద్దరు భారతీయులపై దాడి జరిగినట్లు ఆ దేశ పోలీసు వర్గాలు వెల్లడించాయి.

పోలీసుల కథనం ప్రకారం... మెల్‌బోర్న్ తూర్పు ప్రాంతంలోని దాండెన్‌గాంగ్‌లో నర్దీప్ సింగ్ (21) అనే నర్సింగ్ విద్యార్థిపై మంగళవారం ఐదుగురు దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. దుండగుల్లో ఒకడు కత్తితో నర్దీప్ ఛాతిపై పొడిచాడని పోలీసులు తెలిపారు.

నర్దీప్ చదువుకుంటున్న కిస్లూం ఇనిస్టిట్యూట్ నుంచి బయటికి వస్తుండగా... ఐదుగురు దుండగులు అటకాయించి, సిగరెట్లు అడిగారనీ, తాను సిగరెట్లు తాగనని నర్దీప్ చెప్పడంతో, డబ్బు డిమాండ్ చేశారని పోలీసులు చెప్పారు. డబ్బు ఇచ్చేందుకు నర్దీప్ నిరాకరించటంతో దుండగులు దాడికి పాల్పడ్డారని, గాయాలతోనే నర్దీప్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వివరించారు.

ఇదిలా ఉంటే... మెల్‌బోర్న్‌లోని కారిక్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుంటున్న ఆశిష్ సూద్ (22) అనే విద్యార్థిపై చాపెల్ రోడ్డులో గత శనివారం అర్ధరాత్రి 15 మంది దాడిచేసి కొట్టినట్లు తెలుస్తోంది. లూథియానాకు చెందిన ఆశిష్ మరో ముగ్గురు స్నేహితులతో కలసి వెళుతుండగా, దుండగులు వారి వెంటబడి వేధించటమేగాకుండా, అటకాయించి ఇనుప చువ్వతో దాడి చేశారు.

స్నేహితులు పారిపోవడంతో ఆశిష్ మాత్రం దుండగులకు దొరకడంతో.. దుండగులు అతడిని చితగ్గొట్టి పారిపోయారు. తరువాత వచ్చిన ఆశిష్ స్నేహితులు, అతడిని అల్‌ఫెర్డ్ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. దీంతో గత వారం రోజుల్లో ఆస్ట్రేలియాలో దాడులకు గురైన భారతీయుల సంఖ్య తొమ్మిది చేరింది.

వెబ్దునియా పై చదవండి