ఆసీస్‌లో ఆగని ఘాతుకాలు: మరో భారతీయుడిపై దాడి

FILE
ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడుల పరంపర రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. తాజాగా ఓ భారతీయ క్యాబ్ డ్రైవర్‌పై దాడి జరిగిన సంఘటన వెలుగుచూసింది. కాగా.. ఈ దాడికి పాల్పడిన ఇద్దరు ప్రయాణికుల ఫొటోలను ఆ దేశ పోలీసులు విడుదల చేశారు. అయితే వీరిలో ఒకరు మహిళ కావటం గమనార్హం.

ఉత్తర మెల్‌బోర్న్‌లో గత శనివారమే ఈ సంఘటన జరిగినా, పోలీసులు మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఆసీస్ పోలీసులు వెల్లడించటం అనేక సందేహాలకు తావిస్తోంది. గత వారం రోజుల్లో ఆస్ట్రేలియాలో భారతీయ డ్రైవర్లపై దాడి జరగటం ఇది ఐదోసారి కాగా, జాత్యహంకారంతో దాడి జరిగినట్లుగా తమకు ఎలాంటి ఆధారాలూ లభించలేదని అక్కడి పోలీసులు చెబుతున్నారు.

వివరాల్లోకి వస్తే, ఉత్తర మెల్‌బోర్న్‌లోని రిజర్వాయర్ ప్రాంతంలో సోమర్‌హిల్ హోటల్ వద్ద కారు ఆపిన ఐదుగురు ప్రయాణీకులను ఎక్కించుకునేందుకు 25 సంవత్సరాల భారతీయ క్యాబ్ డ్రైవర్ నిరాకరించాడు. ఆ తరువాత తన కారులో ఐదుగురు ప్రయాణించేందుకు నిబంధనలు ఒప్పుకోవని చెప్పి, ఇద్దర్ని మాత్రమే క్యాబ్‌లో ఎక్కించుకున్నాడు.

ప్లెంటీ రోడ్డులో కారు ఆపిన ఆ ఇద్దరు ప్రయాణీకులు డ్రైవర్‌పై దాడిచేసి, అక్కడ్నించి పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే వారి స్నేహితులను కారులో ఎక్కించుకోలేదన్న కోపంతోనే వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు సమర్థించటం కొసమెరుపు.

ఇదిలా ఉంటే.. దాడి జరిగిన తరువాత ఆంబులెన్స్‌ను పిలిపించి, ముఖానికి తగిలిన గాయాలకు దగ్గర్లోని నార్త్రెన్ ఆసుపత్రిలో చికిత్సపొందినట్లు దాడికి గురైన భారతీయ డ్రైవర్ తమకు చెప్పాడని పోలీసులు వెల్లడించారు. అయితే ఇది జాత్యహంకారంతో కూడుకున్న దాడి అవునో, కాదో విచారణ అనంతరం తేలుతుందని వారు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి