ఆసీస్‌లో దీపావళి వేడుకలు ప్రారంభం

FILE
ఆస్ట్రేలియా రాష్ట్ర రాజధాని మెల్‌బోర్న్‌లో దీపావళి వేడుకలు ఆట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను విక్టోరియా రాష్ట్ర తాత్కాలిక ప్రధాని రాబ్ హల్స్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. తమ రాష్ట్రం శాంతికి, భిన్న సంస్కృతులకు నెలవుగా ఉండాలన్నది తమ అభిమతమని ఈ సందర్భంగా హల్స్ పేర్కొన్నారు.

అలాగే.. భారతీయులపై దాడులను అరికట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నామనీ.. ఇందుకోసం పోలీసుల సంఖ్యను పెంచామనీ, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాబ్ హల్స్ స్పష్టం చేశారు. తమ రాష్ట్ర ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక రంగాలకు భారతీయులు చేసిన సేవలు ప్రశంసనీయమని ఈ మేరకు ఆయన కొనియాడారు.

దీపావళి వేడుకల కోసం విక్టోరియా ప్రభుత్వం 30 వేల డాలర్లను కేటాయించిందనీ.. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ప్రారంభమైన దీపావళి వేడుకలు విజయవంతం కావాలని రాబ్ హల్స్ ఆకాంక్షించారు. కాగా... ఆసీస్‌లో మొదలైన ఈ దీపావళి వేడుకల్లో ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై జాత్యహంకార దాడులు, దోపిడీలు జరిగిన సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థులలో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించేందుకుగానూ.. విక్టోరియా ప్రభుత్వం తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఈ దీపావళి వేడుకలను జరపటం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి