ఆసీస్‌లో విదేశీ విద్యార్థుల నిలువు దోపిడీ..!!

FILE
ఆస్ట్రేలియాలో ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. వివిధ రకాల ఫీజుల పేరుతో విదేశీ విద్యార్థులను ముప్పతిప్పలు పెడుతూ, ఇష్టానుసారం వసూళ్లకు పాల్పడుతున్న ఆ ప్రైవేట్ విద్యా సంస్థలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికే విదేశీ విద్యార్థులపై జరిగిన జాత్యహంకార దాడులతో పరువు పోగొట్టుకున్న ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ప్రైవేట్ విద్యాసంస్థల తీరు మరింత తలనొప్పిగా తయారయ్యిందనే చెప్పవచ్చు. ప్రైవేట్ విద్యా సంస్థలు విదేశీ విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు, ముందస్తు ఫీజుల పేరుతో ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని ఏబీసీ రేడియో వెల్లడించింది.

తాము చెప్పినట్లు అదనపు ఫీజులు చెల్లించని పక్షంలో దేశ బహిష్కరణ తప్పదని పై విద్యా సంస్థలు విదేశీ విద్యార్థులపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఏబీసీ రేడియో వివరించింది. ఈ మేరకు విద్యార్థుల నుంచి అందిన ఫిర్యాదులను సైతం ఏబీసీ బయటపెట్టింది.

ఈ నేపథ్యంలో ఓవర్‌సీస్ స్టూడెంట్ సపోర్ట్ నెట్‌వర్క్ ఆస్ట్రేలియా (ఓఎస్‌ఎస్‌ఎన్‌ఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాబర్ట్ పాల్మర్ మాట్లాడుతూ... తమ దేశంలో విద్యనభ్యసిస్తున్న విదేశీయులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూస్తామని ప్రభుత్వం ప్రకటించిందనీ, అయితే ప్రైవేట్ విద్యా సంస్థల అరాచకాలను మాత్రం ఆపటం లేదని విమర్శించారు.

ప్రైవేట్ విద్యా సంస్థల వైఖరితో విద్యార్థులో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని, అదనపు ఫీజులు చెల్లించేందుకు నిరాకరించిన విద్యార్థులను తరగతి గదుల్లో అనుమతించటం లేదని పాల్మర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ అనుమతించినా, వారు గైర్హాజర్ అయినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారని ఆరోపించారు.

విదేశీ విద్యార్థులను వేధిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలను ఇప్పటికయినా అడ్డుకట్ట వేయాలని పాల్మర్ ఆసీస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటిదాకా తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఆస్ట్రేలియన్ కౌన్సిల్ ఫర్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ (ఏసీపీఈటీ) నిర్వాహకుడు ఆండ్రూ స్మిత్ చెప్పడం, పైగా.. ఈ వ్యవహారంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హామీనివ్వడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి