ఆస్ట్రేలియాలో నివాసం ఇక కష్టసాధ్యమే...!

ఇప్పటిదాకా ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులు స్థానిక కళాశాలల్లో పాకశాస్త్రం, కేశాలంకరణ లాంటి వృత్తి విద్యా కోర్సులను అభ్యసించటం ద్వారా శాశ్వత నివాసం పొందేవారు. ఇకపై అలాంటి పద్ధతులకు అడ్డుకట్ట వేసే విధంగా... ఆ దేశంలో నివసించేందుకు, పని చేసేందుకు అనుమతి కోరేవారు తప్పనిసరిగా ఇంగ్లీష్ భాషా ప్రావీణ్య సాధికార పోటీలో ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుందని ఆస్ట్రేలియా వలసల విభాగం ఆదేశాలు జారీ చేసింది.

ఆస్ట్రేలియా వలసల విభాగం తాజా వలస నిబంధనల ప్రకారం... అక్కడ పనిచేయడానికి శాశ్వత నివాసాన్ని అభ్యర్థించే వృత్తి నిపుణులు ఇంగ్లీషు భాషలో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఇప్పటిదాకా సాధారణ ప్రావీణ్య వలస (జీఎస్ఎం) వీసాల కోసం దరఖాస్తు చేసే విదేశీ విద్యార్థులకు వారి వృత్తి విద్యకు అనుగుణంగా ఇంగ్లీష్‌లో కనీస స్థాయి పరీక్షను నిర్వహించేవారు.

అయితే ఇకమీదట వృత్తి నిపుణులు అంతర్జాతీయ ఇంగ్లీష్ భాషా పరీక్షా విధానం (ఐఈఎల్‌టీఎస్)లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని వలసల విభాగం వెల్లడించింది. ఇదిలా ఉంటే... తమపై తరచుగా జరుగుతున్న జాత్యహంకార దాడులకు నిరసనగా ఆస్ట్రేలియాలోని భారతీయులు తాజాగా మెల్‌బోర్న్‌లో ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి