ఆస్ట్రేలియాలో మరో భారతీయుడిపై దాడి

FILE
ఆస్ట్రేలియాలో జాత్యహంకార దాడులు ఏరోజుకారోజు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మెల్‌బోర్న్‌లో ఒక భారతీయుడిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఒక బృందంగా ఏర్పడిన ఆస్ట్రేలియన్లు 22 సంవత్సరాల సిక్కు యువకుడిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆస్ట్రేలియన్లు సిక్కు యువకుడి తలపై ఉన్న టర్బన్‌ను పీకివేసి దాడి చేయటంతో బాధితుడి తలకు తీవ్రంగా గాయమయ్యింది.

"ది ఏజ్" పత్రిక కథనం ప్రకారం.. దాడికి గురైన సిక్కు యువకుడు ఎప్పింగ్ రైల్వేస్టేషన్ పరిధిలోగల కూపర్ వీధిలో మధ్యాహ్నం 12.45 ప్రాంతంలో బస్ ఎక్కాడు. అదే సమయంలో 17 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన ఓ ఐదుగురు ఆస్ట్రేలియన్లు కూడా బస్‌లోకి ఎక్కారు. వీరిలో ఇద్దరు బస్‌లో నిద్రపోతున్న భారతీయుడి వద్దకు వచ్చి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

అయితే వీరిలో మిగిలిన ముగ్గురు దాడిని ఆపేందుకు ప్రయత్నించారు. అలాగే 60 సంవత్సరాల బస్ డ్రైవర్ కూడా దాడిని ఆపేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కాసేపటి తరువాత ఈ ఐదుగురు బస్‌నుంచి దిగి తప్పించుకు పారిపోయినట్లు తెలుస్తోంది.

తీవ్రంగా గాయాలపాలయిన సిక్కు యువకుడి నోటికి కూడా గాయమయ్యిందనీ.. అయితే అతను వైద్య సహాయమేదీ తీసుకోవటం లేదని ది ఏజ్ వెల్లడించింది. కాగా... ఈ ఘటనకు పాల్పడిన యువకుల కోసం స్థానిక పోలీసులు గాలిస్తున్నారనీ.. ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. దాడికి గురైన సిక్కు యువకుడి పేరు, తదితర వివరాలు మాత్రం తెలియరాలేదు.

వెబ్దునియా పై చదవండి