ఆస్ట్రేలియాలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి

ఆస్ట్రేలియాలో భారతీయులపై జాత్యహంకార దాడుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఎం.కె. ఆలీఖాన్ అనే విద్యార్థిపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆలీఖాన్‌కు కంటికింద గాయం కాగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

చికిత్స పొందుతున్న ఆలీఖాన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... మెల్‌బోర్న్‌లో సెలూన్ నుంచి బయటకు వస్తున్న తనపై దాడి జరిగిందని, డబ్బుల కోసం దాడి చేయలేదని పేర్కొన్నారు. ఖచ్చితంగా ఇది జాత్యహంకార దాడేనని ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా... ఖాన్‌కు ఎలాంటి ప్రాణాపాయమూ లేదని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే... తమ కుమారుడు దాడికి గురయ్యాడన్న వార్త తెలుసుకున్న ఖాన్ తల్లిదండ్రులు, బంధువులు హైదరాబాదులో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఇన్ని ఘటనలు జరుగుతున్నప్పటికీ భారత్, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని వీరు ఆరోపిస్తున్నారు.

తమ దేశంలో చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న భారతీయులపై ఇక ఎలాంటి దాడులు జరగకుండా అడ్డుకట్ట వేస్తామని... ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ మంత్రి క్రిస్ ఇవాన్స్ చెప్పి ఒక రోజు గడవక ముందే మరో దాడి సంఘటన చేటు చేసుకోవడం గమనార్హం. దీనిని బట్టి ఆస్ట్రేలియా ప్రభుత్వం దాడుల విషయంపై ఎంతటి పటిష్టమైన చర్యలు తీసుకుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి