ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన భారతీయుడు

ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడులను సహించలేకపోయిన ఓ భారతీయ సాఫ్ట్‌వేర్ నిపుణుడు... రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్‌ఫోర్స్ (ఆర్ఏఏఎఫ్) వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు "ది ఏజ్" దినపత్రిక వెల్లడించింది. ఏకంగా ఆస్ట్రేలియా ప్రభుత్వానికే ఇంటెర్నెట్ హెచ్చరిక సందేశాన్ని పంపించిన ఇతను.. తనపేరు అతుల్ ద్వివేదీ అని, తాను ఎయిర్‌ఫోర్స్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశానని పేర్కొనడం గమనార్హం.

"ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థులపై జరుగుతున్న జాత్యహంకార దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోండి, లేదా మీ అన్ని వెబ్‌సైట్‌లను ఇలానే హ్యాక్ చేసి హస్తగతం చేసుకుంటాను, ఇది నా హెచ్చరిక" అంటూ అతుల్ ద్వివేదీ ఆ దేశ ప్రధాని కెవిన్ రూడ్‌కు సందేశం పంపినట్లు... ఆ దేశ రక్షణ శాఖ ఆరోపించినట్లు "ది ఏజ్" తన కథనంలో తెలిపింది.

దీంతో... ఆర్ఏఏఎఫ్ అధికారులు తమ వెబ్‌సైట్‌ను ఆఫ్‌లైన్లో ఉంచి, సాంకేతిక కారణాలవల్లనే దాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించి, తదనంతరం దాన్ని పునరుద్ధరించారు. అయితే ఈ హ్యాకర్ తమ వెబ్‌సైట్‌లోని ఎలాంటి సమాచారాన్ని దొంగిలించలేదని వారు పేర్కొన్నారు. ఈ హ్యాకింగ్‌ సోమ-మంగళవారాల మధ్యలో జరిగిందనీ, ఈ ఘటనపై డిఫెన్స్ సెక్యూరిటీ అథారిటీ దర్యాప్తు ప్రారంభించిందని అధికారులు తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి