"క్యూ అండ్ ఏ"రచయిత వికాస్‌కు సత్కారం

భారత దౌత్యవేత్త, "స్లమ్‌డాగ్ మిలీయనీర్" చిత్రానికి మూల కథ అయిన "క్యూ అండ్ ఏ" నవలా రచయిత అయిన వికాస్ స్వరూప్‌ను యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబీసీ) సత్కరించనుంది. జూన్ 17న జరుగనున్న యూఎస్ఐబీసీ 34వ వార్షికోత్సవంలో ఆయన ఈ సత్కారాన్ని అందుకోనున్నారు. ఇదే సందర్భంగా వికాస్ "సాంస్కృతిక సంబంధాల అవార్డు"ను కూడా స్వీకరించనున్నారు.

ఈ విషయమై యూఎస్ఐబీసీ అధ్యక్షుడు రాన్ సోమర్స్ మాట్లాడుతూ... సామాజిక చైతన్యం, మానవతా దృక్కోణంలో వికాస్ స్వరూప్‌కు సత్కారం చేయాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. వికాస్ స్వరూప్ రాసిన క్యూ అండ్ ఏ నవల ఆధారంగా తెరకెక్కిన స్లమ్‌డాగ్ మిలీయనీర్ చిత్రం ఎనిమిది ఆస్కార్ అవార్డులను కైవసం చేసుకున్న సంగతి పాఠకులకు విదితమే.

ఇదిలా ఉంటే... ఈ కార్యక్రమంలో భారత వాణిజ్యమంత్రి, కార్పొరేట్ దిగ్గజాలైన అజీమ్ ప్రేమ్‌జీ, అనిల్ అంబానీ తదితరులు పాల్గోనున్నారు. కాగా, ఇప్పటికే విప్రో ఛైర్మన్ అయిన అజీమ్ ప్రేమ్‌జీకి "గ్లోబల్ విజన్" అవార్డును, అనీల్ ధీరూబాయ్ అంబానీ గ్రూపు అధినేత అనిల్ అంబానీకి "గ్లోబల్ లీడర్‌షిప్" అవార్డును యూఎస్ఐబీసీ ప్రకటించిన సంగతి విదితమే.

వెబ్దునియా పై చదవండి