చండీఘడ్ ఎన్నారైలకు ప్రత్యేక సెల్

ప్రవాస భారతీయులకు న్యాయ సహాయం అందజేసేందుకు పంజాబ్ ప్రభుత్వం ఓ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. చండీఘడ్‌కు చెందిన ఎన్నారైలకు న్యాయ సంబంధ విషయాలలో సహాయం చేసేందుకుగానూ ఈ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.

ఈ విషయమై చండీఘడ్‌ ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ... ఆస్తి, ఆర్థిక, వివాహం తదిర వివాదాలలో న్యాయం పొందేందుకు ఎన్నారైలు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందనీ.. కొన్నిసార్లు ఏజెంట్లబారిన పడి వారు మోసపోతున్నారని చెప్పారు. కాబట్టి.. ఇలా మోసానికి గురవుతున్న ఎన్నారైలకు తాము ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ తగిన సూచనలు, సలహాలను ఇవ్వటమే గాకుండా, న్యాయ సంబంధ విషయాలలో జాప్యం జరుగకుండా చూస్తుందని ఆయన వివరించారు.

ఇదిలాఉంటే... రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో నడిచే ఈ ఎన్నారై సెల్‌లో సీనియర్ పోలీస్ ఎస్పీ, దౌత్యవేత్త, ప్రవాస ప్రతినిధి ఉంటారు. హెల్ప్‌లైన్, ఈ-మెయిల్, పోస్ట్ ద్వారా ప్రత్యేక సెల్‌కు ఫిర్యాదులను పంపవచ్చు. విదేశాల్లోని భారత కార్యాలయాల్లో కూడా ఈ ఫిర్యాదులను ఉంచుతారు.

వెబ్దునియా పై చదవండి