జర్మనీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రవాసాంధ్రుడు

FILE
జర్మనీలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రుడు డాక్టర్ గుజ్జుల రవీంద్ర.. అక్కడి పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. ప్రస్తుతం బ్రాండెన్ బర్గ్ రాష్ట్రంలోని అల్టాండ్స్‌బర్గ్ పట్టణానికి మేయ‌ర్‌గా వ్యవహరిస్తున్న రవీంద్ర.. ఎండ్రి క్సిచ్ వోడర్‌లాండ్ జిల్లాలోని బందే స్టాగ్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లా భద్రచలానికి చెందిన రవీంద్ర వామపక్ష భావజాలం పుష్కళంగా ఉండే కుటుంబంలో జన్మించారు. వైద్య విద్యను అభ్యసించేందుకు 1973లో జర్మనీ వెళ్లిన ఆయన, అక్కడే వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు. 1993వ సంవత్సరంలో రాజకీయాలలోకి ప్రవేశించిన రవీంద్ర.. వామపక్ష అనుకూల సోషల్ డెమోక్రటిక్ పార్టీ (ఎస్‌పీడీ)లో సభ్యుడయ్యారు.

అదే సంవత్సరం బ్రాండెన్‌బర్గ్ రాష్ట్రంలోని అల్టాండ్స్‌బర్గ్ పట్టణానికి జరిగిన ఎన్నికల్లో 80 ఓట్లను సాధించిన రవీంద్ర మేయర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం వరుసగా మూడు దఫాలుగా మేయర్‌గా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే... సెప్టెంబర్ 27వ తేదీన జర్మనీ పార్లమెంటుకు ఎన్నికలు జరుగనున్నాయి.

ఈ నేపథ్యంలో రవీంద్ర మాట్లాడుతూ... విదేశీయులు తమ సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోకుండానే జర్మనీ అభివృద్ధి భాగస్వాములు కావాలనీ, స్థానిక భాష నేర్చుకోకుండా ఇది సాధ్యం కాదని అన్నారు. బెర్లిన్ గోడను కూలగొట్టిన అనంతరం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే అయినప్పటికీ తానయితే ఇప్పటిదాకా ఎలాంటి వర్ణ వివక్షనూ ఎదుర్కోలేదని చెప్పారు.

మరోవైపు.. జర్మనీ పార్లమెంటు ఎన్నికల్లో రవీంద్రకు సునాయాస విజయం లభిస్తుందనీ, అక్కడి తాజా ఎన్నికల సర్వే ప్రకటించింది. ఈయన ఎంపీగా ఎన్నికయినట్లయితే మంత్రి అవకాశాలు మెండుగా ఉన్నాయని అక్కడి మీడియా అంతా కోడై కూస్తోంది. అది నిజమో కాదో తెలియాలంటే ఎన్నికలు జరగాలి, ఫలితాలు వెలువడాలి.. ఆ తరువాతే దీని గురించి వ్యాఖ్యానించవచ్చు.

వెబ్దునియా పై చదవండి