జాతి వివక్ష దాడి కాదు.. స్వదేశీ దురభిమాన దాడి..!

FILE
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ముగ్గురు భారతీయ యువకులపై జరిగిన దాడి వెనుక జాతి వివక్ష ఉందని విక్టోరియా రాష్ట్ర ప్రధానమంత్రి జాన్ బంబ్రీ ఎట్టకేలకు అంగీకరించారు. అయితే ఈ దాడిని జాతి వివక్ష దాడి అని కాకుండా, స్వదేశీ దురభిమానంతో జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.

కాగా.. విక్టోరియాలో ఎలాంటి దాడులనైనా సరే సహించేది లేదని బంబ్రీ స్పష్టం చేశారు. ఇటీవల భారత విద్యార్థులపై జరిగిన జాతి వివక్ష దాడులు తమ దేశ ప్రతిష్టను మంటగలిపాయీ, అయినప్పటికీ తమ దేశంలోకెల్లా విక్టోరియానే సురక్షితమైన ప్రాంతమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ తాజా దాడి నేపథ్యంలో తన భారత్‌ పర్యటనలో ఎలాంటి మార్పులూ ఉండబోవని కూడా ఆయన వెల్లడించారు.

ఇదిలా ఉంటే... జాతి వివక్ష దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో 1991నాటి శిక్షాస్మృతిని సవరించాలని ఆసీస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారతీయులపై జరిగిన తాజా దాడిపై పోలీసులు బుధవారం దర్యాప్తునును ప్రారంభించారు. ఇందులో భాగంగా నలుగురిని అరెస్ట్ చేసి, ప్రశ్నించి వదిలేశామనీ.. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారి గ్లెన్ పార్కర్ చెప్పినట్లుగా "ద ఏజ్" పత్రిక తన వార్తా కథనంలో పేర్కొంది.

అయితే... ఈ తాజా ఘటనపై పలు భిన్న కథనాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 70 మంది ఆస్ట్రేలియన్లు తమవారిపై దాడికి పాల్పడ్డారని బాధితుల బంధువులు ఆరోపిస్తుండగా.. కేవలం నలుగురే దాడిలో పాల్గొన్నారని పోలీసులు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో 20 మంది మాత్రమే ఉన్నారనీ, వీరంతా ప్రేక్షకులుగానే ఉండిపోయారని వారంటున్నారు. మరోవైపు భారతీయులపై 15 మంది ఆసీస్ స్త్రీ పురుషులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ నానా బీభత్సం చేశారని ఘటనను ప్రత్యక్షంగా చూసిన పోలీసులు చెప్పారని పోలీసు ప్రతినిధి చెప్పడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి