డిసెంబర్ 12న యూఎస్ స్టడీ వీసా ఇంటర్వ్యూలు

FILE
అమెరికా సంయుక్త రాష్ట్రాలకు (యూఎస్) విద్యనభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులకు స్టడీ వీసాలను జారీ చేసేందుకు డిసెంబర్ 12వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు.. హైదరాబాదులోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం వెల్లడించింది. ఈ సందర్భంగా 400 స్టడీ వీసాలను జారీ చేయనున్నామనీ.. ఇందుకోసం ఆరోజు కాన్సులేట్ జనరల్ కార్యాలయం విధులను నిర్వహిస్తుందని పత్రికలకు విడుదల చేసిన ఓ ప్రకటనలో కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.

స్టూడెంట్ వీసాల కోసం మొదటి లేదా రెండోసారి ప్రయత్నిస్తున్న విద్యార్థులు మాత్రమే డిసెంబర్ 12వ తేదీ జరిగే ఇంటర్వ్యూలకు రిజిస్టర్ చేసుకోవాలనీ, ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించి విఫలమైనవారు ఆ రోజున ఇంటర్వ్యూల కోసం రిజిస్టర్ చేసుకునేందుకు అనర్హులని కాన్సులేట్ పై ప్రకటనలో తెలిపింది.

ఈ ఇంటర్వ్యూలకు హాజరకు కావాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజును చెల్లించి విధిగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని కాన్సులేట్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే దరఖాస్తు ఫీజును మాత్రం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే అపాయింట్‌మెంట్ షెడ్యూల్, దరఖాస్తు చేసుకునే వివరాలను కాన్సులేట్ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చునని ఆ ప్రకటనలో తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి