త్వరలో కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టం: వయలార్ రవి

FILE
త్వరలో ఓ సరికొత్త ఇమ్మిగ్రేషన్ చట్టం రాబోతోందనీ, దాని పరిధిలో విదేశాలలో పనిచేస్తున్న భారత ఉద్యోగులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రి వయలార్ రవి పేర్కొన్నారు. విదేశాలలో భారతీయ కార్మికులపై జరుగుతున్న దోపిడీ, అక్రమాలను నిరోధించేందుకు రూపొందించిన ఈ కొత్త ప్రవాస బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.

కాగా.. ఈ కొత్త ప్రవాస చట్టం ప్రకారం వివిధ దేశాలలో పనిచేసే ఉద్యోగులు భారత్‌లో తప్పనిసరిగా తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వయలార్ రవి తెలిపారు. 1983నాటి ప్రవాస బిల్లు స్థానంలో నవీకరించిన కొత్త బిల్లును, ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన వివరించారు.

ఇదిలా ఉంటే.. కొత్త ప్రవాస బిల్లు ప్రతిపై అభిప్రాయం తెలుసుకునేందుకు ఇప్పటికే హోంశాఖకు, న్యాయశాఖకు పంపించినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే కేంద్ర మంత్రిమండలి పరిశీలనకు దానిని పంపిస్తారు. అనంతరం అది పార్లమెంటుకు చేరుతుంది. ఈ బిల్లు చట్టంగా అంగీకరించినట్లయితే ప్రవాస అథారిటీ ఒకటి ఏర్పాటు అవుతుంది. అది విదేశాల్లో.. ముఖ్యంగా గల్ఫ్, మలేషియాలలో పనిచేసే భారత కార్మికులకు సంబంధించిన అన్ని విషయాలపైనా దృష్టి సారిస్తుంది.

వెబ్దునియా పై చదవండి