దాడుల వెనుక లెబనీస్ యువత హస్తం..!

ఆస్ట్రేలియాలోతమపై జరుగుతున్న జాత్యహంకార దాడుల వెనుక లెబనీస్ యువత హస్తం ఉండవచ్చునని.. భారతీయ యువకులు ఆరోపించారు. నిరసన ప్రదర్శనలు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ, ఆ దేశ ప్రధాని కెవిన్ రూడ్ హెచ్చరించినప్పటికీ.. ఖాతరు చేయని భారతీయులు వరుసగా మూడో రోజు కూడా సిడ్నీలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

ఈ సందర్భంగా భారత యువకులు మాట్లాడుతూ... తమపై ఇక్కడ జరుగుతున్న దాడుల వెనుక లెబనీస్ యువత హస్తం దాగి ఉండవచ్చునని, ఆ దిశగా ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, ఇలాంటి నిరసన ప్రదర్శనలు ఇక వద్దని స్థానిక భారత నేతలు కోరినా, ఆగ్రహంతో రగిలిపోతున్న భారత యువకులు మాత్రం వారి మాటలను కూడా లక్ష్యపెట్టలేదు.

ఇదిలా ఉంటే... భారతీయ కాన్సులేట్ జనరల్ నియమించిన కాన్సులేట్ కమిటీతో పర్రామట్ట నగర సమితి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన కాన్సులేట్ కమిటీ సమన్వయకర్త యాదుసింగ్... ఈ నిరసన ప్రదర్శనలు తమ లక్ష్యాన్ని సాధించాయనీ, ఇకపై ర్యాలీలు జరపాల్సిన అవసరం లేదని అన్నారు.

కాగా... మంగళవారం రాత్రి ఒక భారతీయుడు హత్యకు గురయ్యాడనీ, మరో భారతీయుడిపై దాడి జరిగిందని వదంతులు వ్యాపించటంతో సుమారు 70 మంది భారతీయులు హారిస్ పార్క్ వద్ద ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలో పాల్గొన్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి పాఠకులకు విదితమే...!

వెబ్దునియా పై చదవండి