ప్రవాసుల నమ్మకాన్ని సంపాదిస్తాం : సామి వేలు

ప్రవాస భారతీయుల నమ్మకాన్ని తిరిగీ సంపాదిస్తామని మలేషియన్ ఇండియన్ కాంగ్రెస్ (ఎమ్ఐసీ) అధ్యక్షుడు సామి వేలు వ్యాఖ్యానించారు. మరింతగా కష్టపడి పనితీరును మెరుగు పరచుకుంటామనీ, లేకపోతే తమ పార్టీ ఉనికినే ప్రవాసులు మర్చిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అధికార బారిసన్ నేషనల్ సంకీర్ణ ప్రభుత్వంలో తమ పార్టీ ప్రవాస భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తోందన్న విషయం తెలియనివారు చాలామంది ఉన్నారని సామి వేలు ఆవేదన చెందారు. ప్రస్తుతం తమ పార్టీ క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటోందనీ, కష్టపడి పనిచేయకపోతే ప్రజలకు దూరమవ్వాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులను హెచ్చరించారు.

64 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎమ్ఐసీ పార్టీ ఇతరులు వేలెత్తి చూపించే విధంగా ఎన్నటికీ ప్రవర్తించబోదని ఈమేరకు సామి వేలు స్పష్టం చేశారు. సెప్టెంబర్‌లో జరుగనున్న పార్టీ ఎన్నికల్లో మంచి నాయకులను ఎన్నుకోవాలని ఆయన తన కార్యకర్తలకు సూచనప్రాయంగా తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి