బిల్లు వస్తే, విరాళం ఇవ్వలేను : స్వరాజ్ పాల్

బ్రిటన్ పార్లమెంటులో సోమవారం ప్రవేశపెట్టనున్న బిల్లుగనుక ఆమోదం పొందినట్లయితే, అధికార లేబర్ పార్టీకి తాను విరాళం ఇచ్చే అర్హతను కోల్పోతానని... ప్రవాస భారతీయ పారిశ్రామిక వేత్త లార్డ్ స్వరాజ్‌ పాల్ అభిప్రాయపడ్డారు. కాగా... బ్రిటన్‌లో శాశ్వత నివాసం లేనివారు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వకుండా నిషేధించాలని సదరు బిల్లులో ప్రతిపాదించటమే దీనికి కారణం.

700 మిలియన్ పౌండ్ల టర్నోవర్, 5 వేల మంది సిబ్బంది కలిగిన "కపారో ఇండస్ట్రియల్ గ్రూపు"కు అధిపతి అయిన లార్డ్ స్వరాజ్‌పాల్... బ్రిటన్ ప్రధానమంత్రి గోర్డాన్ బ్రౌన్‌కు అత్యంత సన్నిహితుడైన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే... పై బిల్లు అమల్లోకి వచ్చినట్లయితే, ప్రవాసులు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వకూడదంటూ... తనను ఉద్దేశిస్తూ "అబ్జర్వర్" అనే పత్రికా కథనంపై పాల్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చట్టం అడ్డుకున్నట్లయితే పార్టీకి తాను విరాళం ఇవ్వలేననీ.. అయితే తానెప్పటికీ లేబర్ పార్టీకి మద్ధతుదారుడినేనని ఆయన స్పష్టం చేశారు.

"దేశంలోని అత్యధికమంది ప్రజలకు లేబర్ పార్టీ ఒక్కటే మేలు చేయగలదని" ఈ సందర్భంగా లార్డ్ స్వరాజ్ పాల్ తన మనసులోని మాటను బయటపెట్టారు. అయితే తాను చట్టాన్ని గౌరవిస్తానని, పై బిల్లు మేరకు తాను పార్టీకి విరాళం ఇవ్వలేకపోవచ్చునని అన్నారు. కాగా... బ్రిటన్ న్యాయశాఖామంత్రి జాక్ స్ట్రా ఈ బిల్లును ప్రతిపాదించారు.

వెబ్దునియా పై చదవండి