బుష్‌ను బెదిరించిన విక్రమ్‌కు నేడు శిక్ష ఖరారు..!

FILE
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్‌కు బెదిరింపు మెసేజ్‌లు పంపించిన నేరంపై అరెస్టయిన భారత యువకుడు విక్రమ్ బుద్ధికి కోర్టు శుక్రవారం శిక్షను ఖరారు చేయనుంది. ఇంతకుముందే కోర్టు దోషిగా నిర్ధారించిన బుద్ధిని ఈరోజు ఇండియానాలోని హమ్మాన్డ్ కోర్టులో హాజరుపరచనున్నారు. శిక్ష ఖరారు నిమిత్తం నవంబర్ 19న ఇతడిని కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా, వివిధ కారణాల రీత్యా డిసెంబర్ 11 నాటికి వాయిదా పడింది.

పూర్‌డ్యూ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యను అభ్యసిస్తుండే 38 సంవత్సరాల విక్రమ్‌ను 2006లో అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఇతను షికాగో కారాగారంలో ఇతను శిక్షను అనుభవిస్తున్నాడు. అప్పటి అధ్యక్షుడు జార్జి బుష్, ఉపాధ్యక్షుడు డిక్ షినేలతోపాటు వారి సతీమణులకు సైతం బుద్ధి బెదిరింపు సందేశాలు పంపాడన్న నేరంపై అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉంటే.. తనకెలాంటి పాపం తెలియదనీ, అక్రమంగా తనను ఈ కేసులో ఇరికించారనీ విక్రమ్ ముందునుంచీ వాపోతున్నాడు. అదే విధంగా బుద్ధి తల్లిదండ్రులు సైతం తమ కుమారుడికి ఏ పాపం తెలియదనీ, అతడిని ఆదుకోవాలని పలుమార్లు భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. విక్రమ్‌ను విడుదల చేయాలంటూ పలువురు భారతీయులు కూడా అప్పట్లో ప్రచారం చేపట్టారు కూడా..!

వెబ్దునియా పై చదవండి