భారతీయుల దృష్టి ఆసీస్‌పైనే : కొలిన్ వాల్టర్స్

ఆస్ట్రేలియాలో విదేశీ విద్యార్థులపైన జాత్యహంకార దాడులు జరుగుతున్నాయంటూ ఓ వైపు ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నప్పటికీ... అంతర్జాతీయ విద్య విషయానికి వచ్చేసరికి భారతీయులు తమ దేశంవైపే దృష్టి సారిస్తున్నారని ఏఈఐ సీఈఓ కొలిన్ వాల్టర్స్ పేర్కొన్నారు.

భారత్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా బృందానికి నేతృత్వం వహించిన కొలిన్ వాల్టర్స్... భారత విద్యార్థులకు తమ దేశం లక్ష్యం కావడానికి పలు కారణాలన్నాయన్నారు. విద్యా ప్రవేశాలకు సంబంధించి ఈ ఏడాది వచ్చిన ఎంక్వయిరీలు నాలుగురెట్లు పెరిగినట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

పది సంవత్సరాల క్రితం ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియాలో తమ పేర్లను నమోదు చేసుకున్నవారు పదివేల మంది విద్యార్థులు కాగా... గత ఏడాదిలో అది ఒక లక్షకు చేరుకున్నట్లు వాల్టర్స్ వివరించారు. తమ దేశంలో చదువుకుంటున్న లక్షమంది భారత విద్యార్థుల్లో పురుషులదే పైచేయిగా ఉంటోందన్నారు. కాగా.. తమ దేశంలో ప్రస్తుతం 5 లక్షల మంది విదేశీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు.

ఇదిలా ఉంటే... విద్యార్థులపై జరుగుతున్న దాడులపై స్పందించిన వాల్టర్స్, ఈ దాడులు జాతి వివక్షాపూరితమైనవి కావని అభిప్రాయపడ్డారు. భారత్‌కు చెందిన పురుష విద్యార్థులపైనే దాడులు జరుగుతున్నాయేగానీ, మహిళలపై జరిగినట్లు ఎక్కడా నమోదు కాకపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చన్నారు. ముఖ్యంగా దొంగతనం కోసం దాడులు జరుగుతున్నాయేగానీ, జాత్యహంకారంతో కావని వాల్టర్ పేర్కొన్నారు.

ఏది ఏమయినా భారత విద్యార్థులతో సహా అంతర్జాతీయ విద్యార్థులకు రక్షణ కల్పించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని వాల్టర్స్ ఈ సందర్భంగా స్పష్టం చేశఆరు. తమ పర్యటనలో భాగంగా తమ బృందం పలువురు విదేశీ విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించారనీ, పిల్లల భద్రతపై వారు వెలిబుచ్చిన సందేహాలను నివృత్తి చేశామని ఆయన తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి