భారత దౌత్య కార్యాలయం చొరవ భేష్ : ఫాలీరో

FILE
కష్టాల్లో ఉన్న భారతీయ మహిళలను ఆదుకునేందుకు ఒమన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం చూపిన చొరవ ప్రశంసనీయమని గోవా ఎన్నారై కమీషనర్ ఎడార్డో ఫాలీరో వ్యాఖ్యానించారు. యజమానులు పెట్టే చిత్రహింసలను భరించలేక పారిపోయి వచ్చిన మహిళలకు ఒమన్ రాయబార కార్యాలయం ఆశ్రయం ఇచ్చి ఆదుకుంటోందని సంతోషం వ్యక్తం చేశారు.

గోవా ఎన్నారై విభాగం, ప్రవాస భారతీయులు ఒమన్‌లో నిర్వహించిన మహాసభల్లో పాల్గొని వచ్చిన అనంతరం ఫాలీరో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. యజమానులు పెట్టిన కేసులు పరిష్కారం అయ్యేదాకా బాధితులు స్వదేశం వెళ్లేందుకు వీలులేనందున వారంతా రోడ్డున పడకుండా రాయబార కార్యాలయం కాపాడిందని ఆయన వివరించారు.

దేశంకాని దేశం వచ్చి, యజమానుల చేతుల్లో అనేక ఇబ్బందులకు గురవుతూ, నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండే భారతీయ మహిళలను చేరదీసి, వారికి తగిన సహాయాన్ని అందించిన భారతీయ రాయబార కార్యాలయానికి ఈ సందర్భంగా ఫాలీరో కృతజ్ఞతలు తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి