మాంద్యం దెబ్బకు ప్రవాసాంధ్రుడి బలి

FILE
ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాలో ఆర్థికమాంద్యం దెబ్బకు మరో ప్రవాసాంధ్రుడు బలయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరానికి చెందిన చంద్రనారాయణ మూర్తి బొమ్మిడి (49) ఫ్లోరిడాలో సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆర్థికమాంద్యం కారణంగా మనోవ్యధకు గురైన ఈయన గత కొద్దిరోజులుగా కోమాలో ఉంటూ, ఈనెల 9న ఆసుపత్రిలో మరణించారు.

ఆర్థికమాంద్యం నేపథ్యంలో సంవత్సరకాలంగా సరైన ఉద్యోగం లేకపోవడం, కుటుంబాన్ని ఎలా పోషించాలన్న వ్యథతో మూర్తి అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. అంతకుముందు మూడు సంవత్సరాలుగా అనేక ఉద్యోగాలు వస్తూ, పోతూ ఉండటం, కుటుంబానికి తానొక్కడే ఆధారం కావటంతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురై కోమాలోకి వెళ్లినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా... ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇదిలా ఉంటే... నారాయణ మూర్తి మృతికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. ఆర్థికంగా ఎలాంటి ఆధారం లేని ఆ కుటుంబాన్ని సాధ్యమైనంత మేరకు ఆదుకుంటామని నాట్స్ ప్రతినిధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అంతేగాకుండా మూర్తి మృతదేహాన్ని స్వదేశం పంపించటంతోపాటు, అక్కడ ఆయన కుటుంబ సభ్యులు బ్రతికేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తామని నాట్స్ వెల్లడించింది. అలాగే.. మూర్తి కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు దాతలు ఎవరైనా ముందుకు రావాలని నాట్స్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

వెబ్దునియా పై చదవండి