యూఎస్ ప్రెసిడెన్షియల్ సదస్సుకు 6గురు భారతీయులు..!!

PTI
వచ్చే వారం అమెరికాలో జరుగనున్న అధ్యక్ష సంబంధ (ప్రెసిడెన్షియల్) సదస్సుకు ఆరుగురు భారతీయులను ఎంపిక చేసినట్లు అమెరికన్ సెంటర్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా.. ఏఫ్రిల్ 26వ తేదీ నుంచి జరుగనున్న ఈ సదస్సు అమెరికా అధ్యక్షుడు బారక్ హుస్సేన్ ఒబామా చేతుల మీదుగా ప్రారంభం కానుంది.

ఉద్యోగ కల్పన మరియు సామాజిక అభివృద్ధి తదితర అంశాలలో వ్యాపారవేత్తల పాత్రను మరింతగా పెంచేందుకుగానూ ఈ సదస్సు ఎంతగానో తోడ్పడుతుందని ఈ మేరకు స్థానిక అమెరికన్ సెంటర్ వెల్లడించిన ప్రకటన వివరించింది. ఈ అంతర్జాతీయ సదస్సుకు 50 దేశాల నుంచి దాదాపు 250 మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అమెరికన్ సెంటర్ తెలిపింది.

కాగా.. ప్రెసిడెన్షియల్ సదస్సుకు ఎంపికైన భారతీయులలో ఇర్ఫాన్ ఆలమ్, షహ్‌నజ్ హుస్సేన్, రామచంద్ర కవిల్, షఫీ మాథెర్, షహీన్ మిస్త్రీ మరియు సిరాజుద్దీన్ ఖురేషీలు ఉన్నారు. సామాజిక సంక్షేమంపై నిబద్ధత, వ్యాపారదక్షత, ఉద్యోగ కల్పన.. తదితర అంశాలలో వీరికి ఉన్న విశేష అనుభవం, క్రియాశీలక ఆలోచనలను ప్రాతిపదికగా చేసుకుని ఈ సదస్సుకు ప్రతినిధులుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి