వంగూరి ఫౌండేషన్ "ఉగాది" ఉత్తమ రచనల పోటీ..!

FILE
రాబోయే వికృతినామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా.. గడచిన 14 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ అమెరికాలోని వంగూరి ఫౌండేషన్‌వారు 15వ ఉగాది ఉత్తమ రచనల పోటీని నిర్వహించనున్నారు. పరాయి దేశాలలో తెలుగు భాషను, సృజనాత్మక రచనలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ పోటీలలో ఉత్తర అమెరికా, ఇతర దేశాలలో నివసిస్తున్న ఆంధ్ర రచయితలందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ఈ మేరకు వంగూరి ఫౌండేషన్ ఆహ్వానం పలుకుతోంది.

ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రసంశాపత్రాలతోపాటు నగదు పారితోషికాలను కూడా తమ సంస్థ అందజేస్తుందని వంగూరి ఫౌండేషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉత్తమ కథానిక రెండు బహుమతులకుగానూ చెరో 116 డాలర్లు, ఉత్తమ కవిత రెండు బహుమతులకుగానూ చెరో 116 డాలర్లు, ఉత్తమ వ్యాసం రెండు బహుమతులకుగానూ చెరో 116 డాలర్లను అందజేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

రాయాలనే కుతూహలం ఉన్నా, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణంచేత తమ కథలను ఎక్కడా ప్రచురించలేని కథా రచయితలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ ఏడాది ప్రత్యేకంగా "నా మొట్టమొదటి కథ" అనే ప్రక్రియను సైతం మొదలుపెట్టినట్లు వంగూరి ఫౌండేషన్ పేర్కొంది. ఈ మేరకు ఆయా రచయితలు వారు మొట్టమొదటగా రాసిన కథలను తమకు పంపించాలని కోరింది. ఈ కథల్లో కనీసం రెండు కథలకు ఒక్కోదానికి 116 డాలర్ల చొప్పున బహుమతులు, ప్రశంసాపత్రాలను అందిస్తామన్నారు.

అంతేగాకుండా.. అర్హత ఉన్న ఇతర కథలన్నింటినీ రాబోయే "అమెరికా తెలుగు కథానిక-పదకొండవ సంకలనం"లో ప్రచురించనున్నట్లు ఫౌండేషన్ తెలిపింది. తరాల తారతమ్యం లేకుండా, విదేశాలలో నివసించే నూతన కథకులందరూ ఈ 'పోటీ'లో పాల్గొనాలని కోరింది.

రచనలు పంపించే రచయితలు గుర్తించుకోవాల్సిందేంటంటే.. ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ మూడు ఎంట్రీలు పంపించవచ్చు. ఒక్కొక్క కథ రాత ప్రతిలో పదిహేను పేజీలలోపు ఉంటే బావుంటుంది. తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చు. విదేశాంధ్ర రచయితల అముద్రిత స్వీయ రచనలను మాత్రమే పరిశీలనకు స్వీకరిస్తారు. సొంత బ్లాగులు, వెబ్‌సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్నా ఫర్వాలేదు. కాగా.. విజేతల ఎన్నికలో న్యాయ నిర్ణేతలది, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వెబ్దునియా పై చదవండి