విదేశీ నిపుణుల రాకకు అడ్డుకట్ట వేస్తాం : బ్రౌన్

FILE
యూరప్ వెలుపలి నుంచి బ్రిటన్‌కు వచ్చే విదేశీ వైద్యులు, ఇతర వృత్తి నిపుణుల రాకకు ఇకపై అడ్డుకట్ట వేస్తామని బ్రిటన్ ప్రధానమంత్రి గార్డన్ బ్రౌన్ స్పష్టం చేశారు. వలస విధానంపై ప్రసంగానికి ముందుగా ఆయన "డెయిలీ మెయిల్" పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పై విధంగా స్పందించారు.

బ్రిటన్‌కు చేరుకుంటున్న విదేశీ నిపుణుల వెల్లువకు అడ్డుకట్ట వేసేందుకు కొన్ని నెలల్లోనే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నామని బ్రౌన్ పేర్కొన్నారు. కాగా.. విదేశీయుల వలసలను కట్టడి చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ముఖ్యంగా భారతీయ వృత్తి నిపుణులపై ప్రభావం చూపగలదని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. యూరప్ వెలుపలి దేశాల నిపుణుల రాకను అరికట్టేందుకు బ్రిటన్ గత సంవత్సరం పాయింట్ల విధానాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి విదితమే. నైపుణ్యాల ఆధారంగా విదేశాల నుంచి వలసవచ్చే వారిని వర్గీకరించి.. అత్యున్నత నైపుణ్యాలు కలిగిన కొద్దిమందిని మాత్రమే అనుమతించేలా ఆ విధానాన్ని రూపొందించారు.

అయితే.. తాజాగా, పై విధానాన్ని సైతం బ్రిటన్ మరింత కఠితరం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు బ్రౌన్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమౌతోంది. మరోవైపు, విదేశీయుల రాకను అడ్డుకోకుంటే, రాబోయే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలను చవిచూడాల్సి వస్తుందనే భయంతోనే బ్రౌన్ ఇందుకు సన్నద్ధమయినట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి