విద్యార్థుల రక్షణకు కార్యాచరణ ప్రణాళిక : గ్లెన్

ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై గత కొంతకాలంగా జరుగుతున్న జాత్యహంకార దాడుల నేపథ్యంలో, విద్యార్థుల రక్షణ కోసం ఆ దేశ విశ్వ విద్యాలయాలు పది సూత్రాల కార్యాచరణ ప్రణాళికను అమలుచేయనున్నట్లు... విశ్వవిద్యాలయాల చీఫ్ ఎగ్జిక్యూటివ్ గ్లెన్ విధర్స్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

పది సూత్రాల కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం దేశ, రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల సంస్థలతో కలిసి పని చేస్తామని గ్లెన్ తెలిపారు. విశ్వవిద్యాలయాల ప్రతినిధులతోపాటు స్థానిక ప్రతినిధులు, విద్యార్థులకు ఉపాధి ఇస్తున్న యాజమాన్యాలతో ఈ అంశంపై చర్చిస్తామని అన్నారు. విద్య ద్వారా అంతర్జాతీయ సమైక్యత కోసం యత్నించడమే తమ ముఖ్య ఉద్దేశ్యమని గ్లెన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

కాగా... విద్యార్థులకు రక్షణ కల్పించడంతోపాటు వారిపై దాడులు నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు, పోలీసులతో కలిసి రక్షణ చర్యలు పెంచడం, సాంస్కృతిక అవగాహన, అంతర్జాతీయ విద్యార్థులున్న చోట రక్షక భటుల ఏర్పాటు, ఫిర్యాదు కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలు పది సూత్రాల ప్రణాళికలో ఉన్నాయి. రెగ్యులర్, ఒకేషనల్ కోర్సులు చదువుతున్న విదేశీ విద్యార్థులపై జాతి వివక్షతో కూడిన దాడులను ఆయన ఈ సందర్భంగా గ్లెన్ ఖండించారు.

ఇదిలా ఉంటే... ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో జూన్ 4, 5 తేదీలలో జరిగిన... ప్రభుత్వ, ప్రైవేటు విశ్వ విద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో పది సూత్రాల కార్యాచరణ ప్రణాళికపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయాల ప్రతినిధులు కాన్‌బెర్రాలోని భారత రాయబారి సూజాత సింగ్‌తో పాటు వివిధ దేశాల రాయబారులను కలిశారు.

వెబ్దునియా పై చదవండి