విద్యార్థుల సంరక్షణకై ప్రభుత్వం చర్యలు

ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న జాత్యహంకార దాడుల నేపథ్యంలో... విదేశాల్లోని మన విద్యార్థుల సంరక్షణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలను చేపట్టింది. భారత విద్యార్థుల యోగక్షేమాలను చూసేందుకుగాను కొన్ని దేశాలలోని భారత దౌత్య రాయభార కార్యాలయాలలో ఒక్కో అధికారిని నియమించనున్నట్లు ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది.

ఈ విషయమై ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖా మంత్రి వయలార్ రవి లోక్‌సభలో మాట్లాడుతూ... భారత విద్యార్థుల రక్షణ కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకోవడాన్ని తప్పనిసరిగా అమలుచేసి, ఆ సమాచారాన్ని ఆయా దేశాల్లోని దౌత్య కార్యాలయాలకు పంపిస్తామన్నారు.

అవసరమైతే ఇందుకోసం ఓ చట్టాన్ని కూడా చేస్తామని చెప్పిన మంత్రి... విదేశాలకు వెళ్లే భారతీయులకు సంబంధించిన వివరాలను తప్పక నమోదు చేసేందుకుగానూ మంత్రిత్వశాఖ ఇప్పటికే ఓ ప్రాజెక్టును ప్రారంభించినట్లు రవి వివరించారు. విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు సంబంధించిన సమాచారంతో డేటాబేస్ ఏర్పాటు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని, ఈ ప్రాజెక్టు 2010 సంవత్సరాంతం నాటికి పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే... 355 విదేశీ సంస్థలు, భారతీయ ఉద్యోగులను వేధిస్తున్నట్లుగా గుర్తించామని వయలార్ రవి లోక్‌సభకు తెలియజేశారు. ఆయా సంస్థలను ప్రయర్ అప్రూవల్ కేటగిరీ జాబితాలో చేర్చామన్నారు. రిక్రూటింగ్ ఏజెంట్లు, విదేశీ సంస్థలు పలు దోపిడీలకు పాల్పడుతున్నట్లుగా విదేశాల్లో భారత దౌత్య కార్యాలయాలకు ఫిర్యాదులు అందుతున్నాయనీ.. దర్యాప్తు చేసిన తరువాత వాటిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి