వైభవంగా ముగిసిన "తెలుగు సంబరాలు"

ఉత్తర అమెరికా తెలుగు సంఘాలు తానా, నాట్స్ మూడు రోజులపాటు జరిపిన తెలుగు సంబరాలు అత్యంత వైభవంగా ముగిశాయి. అలాగే రెండు రోజులపాటు జరిగిన చికాగో తెలుగు అసోసియేషన్ (సీటీఏ) సంబరాలు కూడా ఘనంగా జరిగాయి. ఒకే సమయంలో మూడు సంఘాల వేడుకలు జరగడంతో అమెరికాలో తెలుగుదనం ఉట్టిపడింది.

17వ తానా ద్వైవార్షిక మహాసభలకు వేదికగా నిలిచిన చికాగోలోని రోజ్‌మాంట్ కన్వెన్షన్ సెంటర్ మూడు రోజులపాటు తెలుగువారితో కిటకిటలాడింది. పెద్ద ఎత్తున నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అచ్చతెలుగు వాతావరణాన్ని ప్రతిబింబించాయి. మన రాష్ట్రం నుంచి తరలివచ్చిన వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, హైకోర్టు న్యాయమూర్తి, పారిశ్రామిక వేత్తలు, పలువురు సినీ కళాకారులు హాజరయ్యారు. పదవుల్లో ఎవరు ఉన్నా వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా తెలుగువారి సంక్షేమం కోసం పాటు పడాలని ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు ప్రభాకర్ చౌదరి కాకరాల పిలుపు ఇచ్చారు.

ఇక ఓర్లాండోలోని ఆరంజ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్‌లో మూడు రోజులపాటు జరిగిన నాట్స్ వ్యవస్థాపక వేడుకలు తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. నాట్స్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ సంబరాలకు మంచి ఆదరణ లభించింది. సుమారు ఐదు వేలమంది ఈ వేడుకలకు హాజరైనట్లు నాట్స్ ప్రతినిధి శ్రీధర్ అప్పసాని వెల్లడించారు.

ఈ వేడుకలకు పలువురు సినీ నటులు హాజరయ్యారు. ప్రముఖ టీవీ యాంకర్ ఉదయభాను వ్యాఖ్యానం ఆహుతులను ఆకట్టుకుంది. ప్రముఖ డ్రమ్మర్ శివమణి ప్రదర్శన నాట్స్ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా శ్రీకాంత్, తారకరత్నలను నాట్స్ ఘనంగా సన్మానించింది.

అలాగే... చికాగోలోని ఓడియమ్ ఎక్స్‌పో సెంటర్‌లో సీటీఏ తెలుగు ఫెస్టివల్ కన్నులపండువగా జరిగింది. రెండు రోజులపాటు సాగిన ఈ వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను కట్టిపడేశాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి బృందం ఆలపించిన పాటలు శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి. అనంతరం... సీసీ రెడ్డి, సూపర్ స్టార్ కృష్ణ, గజల్ శ్రీనివాస్‌లకు సీటీఏ జీవితకాల సాఫల్య పురస్కారాలను అందజేసింది.

వెబ్దునియా పై చదవండి