సెనేటర్ డోడ్‌కు "ఫ్రెండ్ ఆఫ్ ఇండియా" అవార్డు

FILE
ప్రముఖ డెమోక్రాట్ సెనేటర్ క్రిస్టోఫర్ డోడ్ "ఫ్రెండ్ ఆఫ్ ఇండియా" అవార్డుకు ఎంపికయ్యారు. భారత్-యూఎస్‌ల మధ్య సంబంధాలను బలోపేతం చేయటంలో క్రియాశీల పాత్ర పోషించినందుకుగానూ డోడ్‌ను ఈ అవార్డు వరించింది.

కాగా.. గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (జీఓపీఐఓ) కనెక్టికట్ ఛాప్టర్ ఈ "ఫ్రెండ్ ఆఫ్ ఇండియా" అవార్డును డోడ్‌కు అందజేయనుంది. మే 2వ తేదీన స్టామ్‌ఫోర్డ్‌లో జరుగనున్న జీఓపీఐఓ నాలుగో సంవత్సర వేడుకలలో భాగంగా డోడ్‌ ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

ఈ సందర్భంగా జీఓపీఐఓకు చెందిన థామస్ అబ్రహాం మీడియాతో మాట్లాడుతూ.. యూఎస్ సెనేట్‌‌లోని ఇండియా కాకస్‌కు కో-ఛైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్న సెనేటర్ డోడ్‌ను ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. భారత్-యూఎస్ సంబంధాలను మెరుగుపర్చటంలోను, ఆర్థిక మరియు రాజకీయ రంగాలలో తనదైన పాత్రను పోషించటమేగాక.. చాలా సంవత్సరాలుగా భారత్-అమెరికా ప్రజానీకానికి చిరస్మరణీయ సేవలను అందించిన డోడ్‌‌ను ఈ అవార్డు సత్కరిస్తున్నట్లు చెప్పారు.

జీఓపీఐఓ-కనెక్టికట్ నాలుగో సంవత్సర వేడుకలలో అనేకమంది ఇండియన్ అమెరికన్లను కూడా గౌరవించనున్నట్లు థామస్ వివరించారు. హర్మన్ ఇంటర్నేషనల్ ఛైర్మన్, ప్రెసిడెంట్ మరియు సీఈఓ అయిన దినేష్ పాలివాల్‌ను "ఇండియన్ అమెరికన్ అచీవర్" అవార్డుతోనూ, నీషా రామచంద్రానీని "యంగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్" అవార్డుతోనూ సత్కరించనున్నట్లు థామస్ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి